దేశంలో ఐఫోన్‌లు, ఇతర యాపిల్ ఉత్పత్తులు తయారు చేసే ఫాక్స్‌కాన్ ప్లాంటులో ఉద్యోగాలకు వివాహిత మహిళలను తిరస్కరించిందని రాయిటర్స్ ఓ సంచలన కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
1976 నాటి సమాన వేతన చట్టాన్ని ఉటంకిస్తూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, ఉద్యోగ నియామకాల్లో పురుషులు, మహిళల మధ్య ఎటువంటి వివక్ష చేయరాదని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుందని పేర్కొంది. చైన్నై సమీపంలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఈ వివక్ష కొనసాగుతోందని రాయిటర్స్ బయటపెట్టిన నేపథ్యంలో తమిళనాడు కార్మిక శాఖ నుంచి వివరణాత్మక నివేదికను కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై యాపిల్, ఫాక్స్‌కాన్ యాజమాన్యాలు వెంటనే స్పందించలేదు.
రాయిటర్స్ మంగళవారం ప్రచురించిన పరిశోధనాత్మక కథనంలో ఫాక్స్‌కాన్ తమిళనాడులోని చెన్నై సమీపంలోని తన ప్రధాన ఐఫోన్ ప్లాంటులో ఉద్యోగాల కోసం వివాహిత మహిళలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని కనుగొంది. పెళ్లైన మహిళలు ఎక్కువ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారనే కారణంతోనే వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నట్లు రాయిటర్స్ గుర్తించింది. రాయిటర్స్ ఇంటర్వ్యూ చేసిన ఫాక్స్‌కాన్ నియామక ఏజెంట్లు, హెచ్ఆర్ వర్గాలు ఇదే విషయాన్ని చెప్పారు. కుటుంబ బాధ్యతలు, గర్భం, అధిక గైర్హాజరును ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో వివాహిత మహిళలను నియమించకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment