
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సీరియల్ నటి రాగమాధురిపై షూటింగ్ సెట్లోనే దాడి జరిగింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో మాధురిపై కోపం పెంచుకున్న హెయిర్ డ్రెసర్ జ్యోతిక తన అనుచరులతో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద ఓ తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతుంది. అయితే రెండు రోజుల క్రితం ఆ సీరియల్‌లో నటిస్తున్న రాగమాధురి నల్లపూసల గొలుసు కనబడకుండా పోయింది. తన గొలుసు మిస్ కావడంపై రాగమాధురి సెట్‌లో ఉన్నవారిని అడిగారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. హెయిర్ డ్రెసర్‌తోపాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాగమాధురి ఫిర్యాదు మేరకు పోలీసులు జ్యోతికను విచారించేందుకు సిద్దమయ్యారు. అయితే ఆ సమయంలో షూటింగ్ సెట్‌లోని వారు కారులో గొలుసు లభించిందని చెప్పి పోలీసులకు దాన్ని అప్పగించి జ్యోతికను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే జ్యోతిక మరో ఎనిమిది మంది అనుచరులతో కలిసి షూటింగ్ వద్దకు వెళ్లి నానా హంగామా సృష్టించారు. రాగమాధురిని తీవ్రంగా కొట్టారు. సెట్‌లో వారు నిలువరించిన వినకుండా ఆమె చీరను కూడా లాగేశారు. దీంతో రాగమాధురి మరోసారి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. నాగమాధురి ఫిర్యాదు మేరకు జ్యోతికతోపాటు ఆమె అనుచరలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment