‘కే’ ట్యాక్స్‌ బాధితుల క్యూ | Seven cases Booked On K-Tax Against Kodela Siva Prasad Family | Sakshi
Sakshi News home page

‘కే’ ట్యాక్స్‌ బాధితుల క్యూ

Published Fri, Jun 14 2019 5:09 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

Seven cases Booked On K-Tax Against Kodela Siva Prasad Family - Sakshi

సాక్షి, గుంటూరు/నరసరావుపేట టౌన్‌: మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల కొడుకు, కుమార్తెపై కేసు  పెట్టేందుకు పోలీస్‌స్టేషన్లకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దౌర్జన్యంగా తమ వద్ద లాక్కున్న డబ్బును వెనక్కు ఇప్పించాలంటూ వారి వద్ద ఉన్న ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా గురువారం మరో ఇద్దరు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లంచాలు దండుకున్న కోడెల కూతురు విజయలక్ష్మీపైనా, లైసెన్స్‌ ఉన్నప్పటికీ మద్యం దుకాణానికి కే ట్యాక్స్‌ కట్టాల్సిందేనంటూ లక్షలు వసూలు చేసిన కొడుకు శివరాంపై బాధితులు ఫిర్యాదు చేశారు. వీరిపై చీటింగ్, బలవంతపు వసూళ్ల సెక్షన్‌ 420, 384  కింద కేసు నమోదు చేశారు. ఇలా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేయించాలనే యోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కోడెల కుటుంబం అక్రమ వసూళ్లు చేసిన విధానం బాధితుల కథనంతో వెలుగులోకి వస్తోంది. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి నేరుగా ఈ వసూళ్లు చేశారని బాధితులు ఆధారాలు సమర్పిస్తున్నారు. తెలుగుదేశ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తోపుడు బండ్ల వ్యాపారుల మొదలు మద్యం వ్యాపారుల వరకు ఎవరినీ వదల కుండా  ‘కే’ట్యాక్స్‌ వసూలు చేసింది. కొత్త ప్రభుత్వం అవినీతి ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతుండటంతో బాధితులంతా న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గత వారం రోజుల నుంచి నరసరావుపేట పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లకు బాధితులు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు, కుమార్తెపై ఇప్పటికే ఐదు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గురువారం మరో రెండు కేసులు నమోదు అయ్యాయి.  

ప్రత్యేక అధికారిని నియమిస్తే మరింత మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం  
కోడెల, ఆయన కుటుంబ సభ్యుల దాష్టికాలపై నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేయించాలనే యోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. అదే జరిగితే భయంతో ఫిర్యాదు చేయకుండా ఉన్న వందలాది మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న వీడియో, ఆడియో రికార్డుల ఆధారాలను సైతం అందించేందుకు బాధితులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.  

బెదిరించి రూ.42 లక్షలు వసూలు చేశారు 
మద్యం వ్యాపారం సజావుగా సాగాలంటే తనకు రూ.50 లక్షల ‘కే’ట్యాక్స్‌ చెల్లించాలని, లేకుంటే కేసులు పెట్టిస్తానని కోడెల శివరాం బెదిరించటంతో విడతల వారీగా రూ.40 లక్షలు చెల్లించానని మద్యం వ్యాపారి మర్రిబోయిన చంద్రశేఖర్‌ టూటౌన్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. మద్యం షాపు నిర్వహించుకోవాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని కోడెల శివరాం బెదిరించాడన్నారు. చివరికి రూ.40 లక్షలకు ఒప్పుకునేలా చేశాడన్నారు. ‘కే’ట్యాక్స్‌ డబ్బులు కట్టటం ఆలస్యమైతే పోలీసులను పంపి బెదిరించేవాడన్నారు. దీంతో తన దగ్గర లేకున్నా వడ్డీకు అప్పు తీసుకొచ్చి మరీ రూ.40 లక్షల రూపాయలు కట్టానని తెలిపాడు. దీనిపై బలవంతపు అక్రమ వసూళ్ల నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు.  

సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం పేరిట మోసం చేశారు 
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మాజీ స్పీకర్‌ కోడెల కుమార్తె విజయలక్ష్మి, ఆమె అనుచరుడు కళ్యాణం రాంబాబు రూ.5.60 లక్షలు కాజేశారని వెంగళరెడ్డి కాలనీకి చెందిన షేక్‌ యాసిన్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సత్తెనపల్లి పట్టణంలో నిర్మించిన నూతన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఆపరేటర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని రాంబాబు నమ్మబలికి విజయలక్ష్మి వద్దకు యాసిన్‌ను తీసుకు వెళ్లాడు. ఆమె ఉద్యోగం కావాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని కోరగా అంత చెల్లించలేనని రూ.5 లక్షల 60 వేలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఉద్యోగం రాకపోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఇద్దరూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బ్రహ్మం తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement