
కోల్‌కత్తా నగరంలో ఈదురు గాలల బీభత్సం
పశ్చిమ బెంగాల్ : కోల్‌కత్తా నగరాన్ని మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులు తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, విద్యుత్ వైర్లు తెగిపోయి ప్రజల మీద పడటంతో 8 మంది చనిపోయారు. సుమారు 30 మంది గాయపడ్డారు. సుమారు 100 కి.మీల వేగంతో గాలులు వీచాయని రీజినల్ మెటియోరాలాజికల్ డైరెక్టర్ జీకే దాస్ తెలిపారు. సుమారు 26 ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోవడంతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు రెండు గంటల పాటు మెట్రో ట్రైన్ సేవలు నిలిచిపోయాయి.
అకస్మాత్తుగా సంభవించిన తుపాను కారణంగా నగరానికి మధ్యలో ఉన్న న్యూమార్కెట్ పోలీస్ స్టేషన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది.ఈ కారణంగా మంటలు చెలరేగి కరెంటు పోయి అంధకారంలో మునిగిపోయింది. రాత్రంతా కరెంటు లేక తుపానులో పోలీసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పని ముగించుకుని సరిగ్గా ఇంటికి వెళ్లే సమయంలో తుపాను రావడంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్, విపత్తు నిర్వహణా సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

Comments
Please login to add a commentAdd a comment