
పెద్దపల్లి : భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. అత్తమామలు తల్లి తరఫున రక్తసంబంధికులే.. ఇక తన జీవితం పచ్చని కాపురంతో వెలుగుతుందని ఆశపడ్డ ఆ యువతికి ఆరు నెలలు తిరగక ముందే నరకం చూపించారు. తాళలేని ఆ నవవధువు మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూరు గ్రామానికి చెందిన కొమురయ్య కూతురు ముత్యాల కోమలత (23)ను ఆరు నెలల క్రితం పెద్దపల్లి జిల్లా మద్దికుంట గ్రామానికి చెందిన ఈర్ల విజయ్‌కి ఇచ్చి పెళ్లి చేశారు.
ఆ సమయంలో రూ.15 లక్షల కట్నం, కానుకలు ఇచ్చారు. కోమలత తల్లికి కొమురయ్య స్వయాన సోదరుడే కావడంతో సంసారం సుఖంగా సాగుతుందని పుట్టింటివారు ఆశించారు. అప్పటికే విజయ్ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో కూతురు సంతోషంగా ఉంటుందనుకున్నారు. ఇటీవల ఉద్యోగాన్ని వదులుకున్న విజయ్ ఇంటిదారి పట్టి హార్వెస్టర్ కొనుగోలు చేశాడు. ఆ సమయంలో కోమలత పుట్టింటివారు మరో రూ.5 లక్షలు విజయ్‌కి ఇచ్చారు.
కోడలిపై మామ లైంగిక వేధింపులు..
ఈర్ల కొమురయ్య వ్యూహాత్మకంగా కోడలిపై లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కుమారుడికి దీక్ష ఇప్పించి రెండు నెలల పాటు ప్రతీ రోజు కోడలిని లైంగికంగా వాంఛ తీర్చాలని వెంటపడ్డాడు. ఈ విషయం కులపెద్దలకు చెప్పడంతో ఈర్ల కొమురయ్యను మందలించారు. అయినా వేధింపులు ఆగలేదు. మూడు రోజుల క్రితం ఇదే విషయమై మళ్లీ పంచాయితీ జరిగింది. అందరూ మామ వైఖరిని తప్పుబట్టారు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. మరోవైపు అత్త, భర్త మానసికంగా వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్రమస్తాపం చెందిన కోమలత మంగళవారం తన అత్తారింట్లో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
భర్త, అత్తమామలు పరారీ..
కోమలత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని భర్త, అత్తమామ ఊరు వదిలి పారిపోయారు. మృతదేహానికి అత్తింటి వారే దహన సంస్కారాలు చేయాలని.. నిందితులను పట్టుకోవాలని కోమలత బంధువులు పోలీసులను కోరారు. ఇందుకోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి సాయంత్రం మృతదేహాన్ని అంతిమయాత్ర కోసం ఊటూరుకు తరలించారు. కోమలత ఆత్మహత్య కేసులో ఈర్ల విజయ్, కొమురయ్య, విజయ, ఆడబిడ్డ స్వప్న, మహేందర్ కేసు నమోదు చేసినట్లు సీఐ నరేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment