భార్య మృతి కేసులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్‌కు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. సునంద మృతిలో కేసులో 3000 పేజీల చార్జిషీట్‌ను రూపొందించిన ఢిల్లీ పోలీసులు.. థరూర్ పేరును నిందితుడిగా చేర్చారు. ఐపీసీలోని 498-ఏ(గృహహింస), 360(ఆత్మహత్యకు ప్రేరేపించటం) సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇంతదాకా అరెస్ట్ మాత్రం చేయని పోలీసులు.. తాజాగా జూలై 7న కోర్టు విచారణకు మాత్రం హాజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు. దీంతో థరూర్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే బెయిల్ దొరికితే ఆయన దేశం విడిచిపోతారని పోలీసులు వాదించగా, కోర్టు ఆ వాదనతో ఏకీభవించలేదు. లక్ష రూపాయల పూచీకత్తు, దేశం విడిచిరాదన్న షరతుల మేరకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఓ లగ‍్జరీ హోటల్ గదిలో సునంద అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందగా, కేసుపై దర్యాప్తు కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
స్వామి వెటకారం... కాగా, సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్‌కు బెయిల్ లభించటంపై బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి స్పందించారు. ‘థరూర్ ఇప్పుడు వేడుకలు జరుపుకోవటం అప్రస్తుతం. అతనేం తీహార్ జైల్లో కూర్చోడు. రాహుల్, సోనియా గాంధీలతో కూర్చుంటాడు. అఫ్‌కోర్స్.. వాళ్లు కూడా బెయిల్ వాలాస్(బెయిల్‌పై ఉన్నవాళ్లే) కదా! మంచి కంపెనీ’ అంటూ స్వామి ఛలోక్తులు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment