సంఘటనా స్థలంలో పోలీసుల పరిశీలన
గజ్వేల్ : మండలంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనమైన ఘటన కలకలం రేపుతోంది. ఇదే గ్రామంలో ఎనిమిది రోజుల క్రితం 14మంది మృత్యువాతకు గురైన ఘటనాస్థలికి సమీపంలో ఇది జరగడం కలవరపరుస్తోంది. కారులో మంటలు చెలరేగి వ్యక్తి దుర్మరణం పాలైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు రంగారెడ్డి జిల్లా మచ్చబొల్లారానికి చెందిన దుగ్యాల భూమారావు(55)గా గుర్తించారు. ఈయన ఓ ప్రముఖ కుటుంబానికి బంధువని పోలీసులు చెబుతున్నారు.
ఆయన శుక్రవారం రాత్రి కొమురవెళ్లి పుణ్యక్షేత్రంలో నిద్రించి తెల్లవారు జామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటికి తిరిగి రావాలనే ఆలోచనతో(ఏపీ 11పీ 8686)తన ఆల్టో కారులో ఒంటరిగా బయల్దేరాడు. రాత్రి 10:30గంటల ప్రాంతంలో మార్గమధ్యంలోని గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్దకు చేరుకోగానే కారులో అనూహ్యంగా మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. మంటల ధాటికి అతడి శరీరం బూడిదైపోయింది. ఎముకలు మాత్రమే మిగిలిపోయాయి. ఈ సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డిలు చేరుకొని పరిశీలన జరిపారు.
అసలేం జరిగింది..?
కారులో మంటలు చెలరేగి భూమారావు సజీవ దహనమైన ఘటనపై గజ్వేల్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం... కారు రిమ్మనగూడ వద్దకు చేరుకోగానే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. మంటలు క్షణాల్లో ఉధృతంగా మారడం.. ఇదే క్రమంలో కారు ఆటో లాక్ ఉండడం వల్ల అతను బయటకు వెళ్లలేక అందులోనే పూర్తిగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయని చెబుతున్నారు. కారు ముందు భాగంలో చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఇంజిన్ మొత్తం ఆక్రమించి..
ఆ తర్వాత పెట్రోల్ ట్యాంక్‌ను తాకడం, ఇదే క్రమంలో టైర్లను అంటుకోవడంతో వాటిని ఆర్పడం అసాధ్యంగా మారింది. మంటలు చెలరేగిన తర్వాత కొద్ది సేపటికి రిమ్మనగూడ గ్రామానికి చెందిన యువకులు పలువురు వచ్చి కాపాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటికే భూమారావు పూర్తిగా కాలి మాడి మసైపోయాడు. పోలీసులు వచ్చిన తర్వాత అగ్నిమాపక యంత్రాన్ని రప్పించి మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఆ తర్వాత కార్లో పూర్తిగా దగ్ధం కాగా మిగిలిపోయిన ఎముకలు బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. అనంతరం బంధువులకు అప్పగించారు.
వాహనదారుల్లో వణుకు..
కారు దగ్ధమైన ఘటన వాహనదారుల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రత్యేకించి ఇబ్బడిముబ్బడిగా వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రాజీవ్ రహదారిపై ఈ ఘటన అందరి నోళ్లల్లో నానుతోంది. కార్లలో షార్ట్ సర్క్యూట్ సంభవించడానికి కారణాలేంటి..? ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఏ విధంగా జాగ్రత్తపడాలనే అంశంపై చర్చ మొదలైంది. శుక్రవారం రాత్రి కాలిపోయిన కారు 2005 మోడల్‌గా స్పష్టమవుతోంది. కార్లు, ఇతర వాహనాలు సక్రమంగా పనిచేస్తున్నాయా..? వైరింగ్ సక్రమంగా ఉందా..? సర్విసింగ్ సకాలంలో చేయిస్తూ, ఆయిల్ మెయింటనెన్స్ సరిగా ఉందా..? అనే అంశాలను సైతం పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన చాటి చెబుతోందని పలువురు మెకానిక్‌లు, వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కారు దగ్ధం ‘కలకలం’ మిగిల్చిందని చెప్పక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment