సాక్షి, జమ్మలమడుగు : న్యాయన్యాయాలు విచారించకుండానే ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించిన ఓ దళితుడిని ఎస్‌ఐ చితకబాదిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన గుజ్జారి ప్రసాద్ తన ఇంటి ఆవరణలో అదనపు గది నిర్మించుకుంటున్నాడు. ఇందుకు అడ్డుగా ఉన్న పక్కింటి వారి చెట్టును ప్రసాద్ కొట్టివేశాడు. దీంతో చెట్టు యజమాని సురేష్ మైలవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రసాద్‌ను స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి చేయి చేసుకున్నాడు.
ఇంటి నిర్మాణానికి చెట్టు అడ్డం వస్తుందని, దానిని తొలగించాలని పలు మార్లు వారికి విజ్ఞప్తి చేశానని, వారు పట్టించుకోకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో తానే కొట్టేశానని ప్రసాద్ వివరణ ఇస్తుండగానే.. ఎస్‌ఐ మళ్లీ కొట్టాడు. తన వాదన వినకుండానే ఎందుకు కొడుతున్నావని ప్రసాద్ ప్రశ్నించాడు. దీంతో ఎస్‌ఐ లాఠీ కర్రతో చితకబాదాడు. దూషిస్తూ ఇష్టారాజ్యంగా కొట్టాడు. ప్రసాద్ తలకు గాయమైంది. బాధితుడిని బయటికి పంపించకుండా అక్కడే ఉంచారు. వెంట వచ్చిన ప్రసాద్ కుమారుడు సంజీవ్‌ను సైతం బయటికి పోనివ్వలేదు. రాత్రి అయినా వారిని స్టేషన్‌లోనే ఉంచారు. ఈ విషయంపై జమ్మలమడుగు రూరల్ సీఐ ఉమామహేశ్వరరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. విచారణ చేసి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment