ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఎస్‌ఐ సంతోష్‌కుమార్
ఇటీవల కాలంలో పోలీసుల ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం సంఘటనలు రాష్ట్రంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సర్వీసు రివాల్వరే క్షణికావేశానికి లోనైయ్యే వారి ప్రాణాలను హరిస్తోంది. గత నెలన్నర వ్యవధిలో పోలీసు శాఖలో 10 మంది ఆత్మహత్య చేసుకోగా, మరో ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా మంగళవారం రాత్రి మరో రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: భరించలేని పనిభారమా..? ఉన్నతాధికారుల వేధింపులా..? కలవరపాటుకు గురిచేస్తున్న కుటుంబ సమస్యలా..? కారణం ఏదైతేనేం ప్రాణాలు తీసుకోవడమే ఏకైక పరిష్కార మార్గంగా భావిస్తున్నారు పోలీసుశాఖలోని కొందరు. మదురై సమీపం పులియగుళం కేకే నగర్‌కు చెందిన ముమ్మూర్తి (40)కి భార్య వాసుకి (35), 12 ఏళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. తెప్పగుళం పోలీస్‌స్టేషన్‌లో ముమ్మూర్తి హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తెప్పకుళంలో హెడ్‌కానిస్టేబుల్‌గా చేరిన తరువాత గత ఏడాదిగా ‘నేను చనిపోతాను’ అని భార్యతో పదేపదే అనేవాడు. ఈ మాటలతో దంపతుల మధ్య తరచూ తగాదాలు చోటుచేసుకునేవి. అదే తీరులో మంగళవారం రాత్రి సైతం భార్య వద్దకు వెళ్లి చనిపోతాను అనడంతో ఆమె నిలదీశారు. ఇద్దరూఘర్షణపడ్డారు. ఆ తరువాత ఇంటిలోని దేవుని గదిలోకి వెళ్లి అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
నిద్రమాత్రలు మింగిన ఎస్‌ఐ
చెన్నై పులియంతోపు పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే సంతోష్‌కుమార్ (30) రాయపురం సింగారతోటలోని పోలీసు కార్వర్ట్‌లో భార్య కళావతి, కుమారుడు, కుమార్తెతో నివసిస్తున్నాడు. మంగళవారం యథావిధిగా విధులకు హాజరైన సంతోష్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లోని ఎవరితోనూ మాట్లాడకుండా విరక్తి నిండిని వ్యక్తిలా వ్యవహరించాడు. పనులు ముగించుకుని మంగళవారం రాత్రి క్వార్టర్స్ చేరుకున్న వెంటనే భారీ మోతాదులో నిద్రమాత్రలు మింగేశాడు. మాత్రల ప్రభావం వల్ల తలతిరగడంతో పులియంతోపు ఇన్స్‌పెక్టర్ రవికి ఫోన్‌చేసి ‘నేను పెద్ద సంఖ్యలో నిద్రమాత్రలు మింగాను, నన్ను కాపాడండి’ అంటూ రోదించాడు. ఈ సమాచారం అందుకున్న ఇన్స్‌పెక్టర్ రవి వెంటనే క్వార్టర్స్‌కు చేరుకుని సంతోష్‌కుమార్ భార్య బిడ్డలకు సమాచారం ఇచ్చాడు. స్పృహతప్పిన స్థితిలో ఉన్న సంతోష్‌కుమార్‌ను సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఎస్‌ఐకి ఐసీయూలో తీవ్రచికిత్స అందిస్తున్నారు. పనిభారం, ఉన్నతాధికారుల వేధింపులు, కుటుంబ సమస్యలు వీటిల్లో ఏదేని కారణాలతో ఆయన ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుశాఖలోని ఇద్దరు వ్యక్తులు ఒకేరోజున బలవన్మరణానికి దిగడం కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment