
‘ఆర్‌సీ’తో ఏమార్చి కోట్లు కొట్టేశారు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : సింగరేణి బొగ్గు రవాణాలో ఇదో కొత్త తరహా కుంభకోణం! బొగ్గు రవాణా చేసే లారీకి రవాణా శాఖ జారీ చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ)ని మార్చేసి కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టారు. ఒరిజినల్ ఆర్‌సీలో పేర్కొన్న వాహనం బరువు (నెట్ వెయిట్)ను కలర్ జిరాక్స్‌లో మార్ఫింగ్ చేసి గుట్టుగా దందా సాగించారు. బొగ్గుతో లోడ్ చేసిన తర్వాత వచ్చే లారీ బరువు(టోర్)ను లెక్కలోకి తీసుకొని ప్రతి లోడ్‌లో రెండు నుంచి మూడు టన్నుల వరకు అధికంగా రవాణా చేస్తున్నట్లు సింగరేణి అధికారులను బురిడీ కొట్టించారు. ఇలా ‘కిలోమీటరు, టన్ను, ట్రిప్పుల’ప్రాతిపదికన ప్రతి బొగ్గు లారీకి చెల్లించే మొత్తాన్ని పెంచేసుకొని రోజుకు లక్షల్లో, నెలకు కోట్లల్లో జేబుల్లోకి వేసుకున్నారు.
శ్రీరాంపూర్ ఏరియాలో ఓ క్లర్క్.. ఆర్‌సీలపై అనుమానంతో తీగ లాగగా ఈ స్కాం డొంక కదిలింది. రవాణా శాఖ యాప్ ద్వారా ఒరిజనల్ ఆర్‌సీని తనిఖీ చేయగా.. లారీల బరువును ఒకటి నుంచి మూడు టన్నుల వరకు తగ్గించి కలర్ జిరాక్స్ ఆర్‌సీలను తయారు చేసినట్లు తేలింది. శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల నుంచి తీసిన బొగ్గును సమీపంలోని కోల్ హాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)లకు రవాణా చేసే ప్రక్రియలోనే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయంటే... సీహెచ్‌పీల నుంచి వేరే ప్రాంతాలకు రోజూ తరలివెళ్లే బొగ్గు రవాణాలో సింగరేణి ఎంత నష్టపోతుందో తేలాల్సి ఉంది.
వాహనం బరువుకు ఆర్‌సీ ప్రామాణికమా?
సాధారణంగా ఒక లారీలో రవాణా అయ్యే సరుకు బరువును కాంటా (వేయింగ్ మిషన్) ద్వారా తెలుసుకుంటారు. ఖాళీ లారీ బరువును ముందుగా తూకం వేసి, సరుకుతో నిండిన తర్వాత మరోసారి తూకం వేస్తే కచ్చితమైన బరువు ఎంతో తెలుస్తుంది. సాధారణంగా ఏ సరకు రవాణాకైనా ఇదే ప్రామాణికం. కానీ సింగరేణిలో బరువు తూచే విషయంలో వాహనం ఆర్‌సీని కూడా పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. ఆర్‌సీలో పేర్కొన్న వాహన నెట్ బరువు, గని వద్ద తూకం వేసిన వాహన బరువులో ఏది తక్కువగా నమోదైతే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధనను చేర్చారు. బొగ్గు రవాణా అనంతరం సీహెచ్‌పీ వద్ద వాహన బరువు (టేర్)ను లెక్కించి రవాణా అవుతున్న బొగ్గు గ్రాస్ వెయిట్‌ను కొలుస్తారు. దీని ప్రకారం ఎంత బొగ్గు రవాణా అయితే అన్ని టన్నులకు దూరం ఆధారంగా కాంట్రాక్టు సమయంలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించడం జరుగుతోంది. ఇలా ఎక్కడా లేని ఆర్‌సీ నిబంధనను బొగ్గు రవాణాలో పెట్టడం వల్ల కలర్ జిరాక్స్ ద్వారా మార్ఫింగ్‌కు అవకాశం కల్పించినట్లయింది.
ఎలా బయటపడిందంటే?
శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కార్యాలయంలోని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఓ క్లర్క్ ఇటీవల కాంట్రాక్టు సమయం పూర్తయిన బొగ్గు రవాణా లారీల వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో లారీ నెట్ బరువుకు సంబంధించి దాఖలు చేసిన ఆర్‌సీలలో అక్షరాల్లో తేడా ఉండడం గమనించారు. ఓ ట్రాన్స్‌పోర్టు సమర్పించిన 10 ఆర్‌సీల్లో ఈ తేడా కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన రాష్ట్ర రవాణా శాఖ రూపొందించిన ‘ఆర్‌టీఏ ఎం–వాలెట్’యాప్ ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గు రవాణా చేసే ఒరిజనల్ ఆర్‌సీలను పరిశీలించారు. 60 లారీలకుగాను 39 లారీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఆర్‌సీలలో లారీ నెట్‌వెయిట్‌ను టాంపరింగ్ చేసినట్లు తేలింది. సదరు ట్రాన్స్‌పోర్టుకు చెందిన పది లారీలలో మూడు టన్నుల తేడా రాగా, మరో లారీలో ఒక టన్ను తేడా చూపించారు. మరో లారీకి రెండు టన్నుల తేడాతో ఆర్‌సీ తయారు చేశారు. మిగతా 18 లారీలకు సంబంధించి కూడా ఒకటి నుంచి రెండు టన్నుల తేడాలతో ఆర్‌సీలలో నెట్‌వెయిట్ మార్చేశారు. దీంతో ఆ క్లర్క్ పై అధికారుల ద్వారా సింగరేణి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు.
రోజుకు లక్షల్లోనే ఎసరు
బొగ్గు గని నుంచి సీహెచ్‌పీకి బొగ్గు రవాణా చేసినందుకు సగటున కిలోమీటరుకు రూ.10 చెల్లించేలా ఒప్పందం కుదిరిందనుకుంటే.. ఒక లారీ కనీసం పది కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. అంటే ఒక టన్నుకు రూ.100 చెల్లించాలి. రోజుకు ఎనిమిది ట్రిప్పుల మేర లారీ తిరిగితే టన్నుకు రూ.800 చొప్పున చెల్లించాలి. అంటే మూడు ట్రిప్పులకు అదనంగా చెల్లించినా ప్రతి లారీకి రూ.2,400 చొప్పున ముట్టజెప్పడమే. శ్రీరాంపూర్‌లో గుర్తించిన 39 లారీలకు ప్రతి ట్రిప్పుకు సుమారు 100 టన్నులకు పైగా ప్రతిరోజు అదనంగా చెల్లిస్తూ వచ్చారు. ఇక్కడే రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకు అదనంగా చెల్లిస్తున్నట్లు సమాచారం.
మిగతా ఏరియాల్లో ఇంతేనా?
ఏటా 64 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణి సంస్థలో 13 కోల్ హాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)లతోపాటు పెద్ద సంఖ్యలో బొగ్గు డిస్పాచ్ పాయింట్లు ఉన్నాయి. సింగరేణిలోని 19 ఓపెన్‌కాస్ట్ గనులు, 29 భూగర్భ గనుల నుంచి వెలికితీసిన బొగ్గును డిస్పాచ్ పాయింట్‌ల వరకు లారీల్లో తీసుకెళ్తారు. అక్కడ్నుంచి రైలు మార్గంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతుంది. గనుల నుంచి సీహెచ్‌పీల వరకు బొగ్గు రవాణా చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా వేలాది లారీలను వినియోగిస్తున్నారు. ఈ లారీల నెట్‌వెయిట్‌ను మార్చేసే తంతు ఎప్పట్నుంచి నడుస్తుందో తెలియదు. అందుకే అతి తక్కువ బిడ్‌తో బడా కాంట్రాక్టర్లే సింగరేణిలో రవాణా కాంట్రాక్టులను పొందుతున్నారని అర్థమవుతోంది. సింగరేణి విజిలెన్స్ విభాగం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment