అర్చన, అంజుల (ఫైల్)
వరుసకు వారు అక్కాచెల్లెళ్లు.. చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు.. ఒకరి సుఖదుఃఖాలను మరొకరు పంచుకుంటూ వచ్చారు. మృత్యువులోనూ వీరి బంధం వీడిపోలేదు. ఒకరికోసం మరొకరు అన్నట్టుగా.. ఇద్దరూ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా నేరడిగొండ మండలం బొందిడి గ్రామానికి చెందిన ఆడె కమల్‌సింగ్, భీంసింగ్ అన్నదమ్ములు. వీరి కూతుళ్లు ఆడె అంజుల (18), ఆడె అర్చన (19) అక్కాచెల్లెళ్లు అయినప్పటికీ చిన్ననాటి నుంచి స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవారు. 7వ తరగతి చదివిన అంజుల ఆ తర్వాత చదువులను కొనసాగించలేదు. అర్చన మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. వీరిద్దరు గురువారం ఆత్మహత్యాయత్నం చేయగా, శుక్రవారం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. అంజులకు ఆదివారం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. తనకు పెళ్లి కొడుకు నచ్చలేదని తల్లిదండ్రులకు చెప్పింది. అయినా వారు వినకుండా వివాహం నిశ్చయం చేశారు. దీంతో మనస్తాపం చెందిన అంజుల తన చినాన్న కూతురైన అర్చనను వెంటబెట్టుకొని బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో నేరడిగొండ పోలీసుస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.
గత నాలుగు రోజుల క్రితం వీరిద్దరు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైలు మార్గంలో ఆదిలాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి ఇచ్చోడ, ఆ తర్వాత సిరికొండకు వచ్చినట్లు పేర్కొంటున్నారు. గురువారం సిరికొండ మండల కేంద్రం సమీపంలో ఇద్దరు యువతులు క్రిమిసంహారక మందు తాగారు. వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అంజుల మృతి చెందారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment