బినామీల ఇళ్లలో సిట్‌ సోదాలు | SIT Inquiry Started into Insider Trading in the Amaravati Lands | Sakshi
Sakshi News home page

బినామీల ఇళ్లలో సిట్‌ సోదాలు

Published Sat, Feb 29 2020 5:00 AM | Last Updated on Sat, Feb 29 2020 9:19 AM

SIT Inquiry Started into Insider Trading in the Amaravati Lands - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తొలి గురిపెట్టింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం శుక్రవారం విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. విజయవాడ పటమటలో కొందరు కోటీశ్వరుల ఇళ్లను కూడా తనిఖీ చేసింది.

వీరిలో ఒకరు టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువుగా చెబుతున్నారు. వీరి ఇళ్లల్లో సిట్‌ పలు కీలక ఆధారాలను సేకరించింది. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకుంది. సిట్‌ అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. వారి ఆస్తులు, ఆదాయాలు, రాజధానిలో కొన్న భూములు, వాటికి డబ్బులు ఎలా వచ్చాయి, టీడీపీ నేతలతో వారి సంబంధాలపై ప్రశ్నించడంతోపాటు వారి వద్ద అనేక పత్రాలను తీసుకుని పరిశీలించారు. కాగా, ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈడీ కూడా మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది.  

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఆరా.. 
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై రాష్ట్రంలో ఎక్కడైనా దర్యాప్తు చేసి.. ఎవరినైనా విచారించి, కేసులు నమోదు చేసేందుకు సిట్‌కు ప్రభుత్వం అధికారాలిచ్చింది. గత ప్రభుత్వ పెద్దలకు రాజకీయ, ఆర్థిక లబ్ధి కలిగేలా రాజధాని పేరుతో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, తదితర అక్రమాలకు పాల్పడ్డట్టు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో సిట్‌ రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పైనే తొలి విచారణ చేపట్టింది. రాజధానిలో 797 మంది తెల్లకార్డుదారులు కొనుగోలు చేసిన భూములు, వారి కార్డుల నంబర్లు, తదితర అన్ని వివరాలను సీఐడీ నుంచి తెలుసుకుని వాటి పరిశీలన చేపట్టింది.  

పోరంకి నుంచి సిట్‌ కార్యకలాపాలు.. 
సిట్‌ ప్రత్యేకాధికారిగా నియమితులైన కొల్లి రఘురామిరెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీఐజీగా కూడా ఉన్నారు. దీంతో సిట్‌ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై అనేక ప్రతిపాదనలను పరిశీలించారు. ప్రస్తుతానికి ఆయన విజయవాడ పోరంకి ప్రాంతంలోని తన (ఇంటెలిజెన్స్‌) కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement