‘కళ్లు’గప్పి కడతేర్చే కుట్ర! | Sit officers revealed the facts in front of High Court about Murder Attempt On Ys Jagan | Sakshi
Sakshi News home page

‘కళ్లు’గప్పి కడతేర్చే కుట్ర!

Published Wed, Nov 14 2018 4:29 AM | Last Updated on Wed, Nov 14 2018 8:55 AM

Sit officers revealed the facts in front of High Court about Murder Attempt On Ys Jagan - Sakshi

కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పి భవిష్యత్‌పై భరోసా ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది నవంబరులో ఇడుపులపాయ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు...  సరిగ్గా అప్పుడే అమరావతి కేంద్రంగా ప్రతిపక్ష నేతను అడ్డు తొలగించుకునే నీచమైన ఎత్తుగడ పురుడు పోసుకుంది.  
టీడీపీ నేత, ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరి ద్వారా విశాఖ విమానాశ్రయంలో కుట్ర కథ నడిపించారు.  
ప్రతిపక్ష నేత పాదయాత్ర ఈ ఏడాది ఆగస్టులో ఉత్తరాంధ్రలోకి ప్రవేశించగానే  అంటే సరిగ్గా మూడు నెలల క్రితం కుట్ర అమలుకు ప్రభుత్వ పెద్దలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సరిగ్గా అప్పటి నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయం తాజాగా వెలుగులోకి రావడం కుట్ర కోణాన్ని బహిర్గతం చేస్తోంది. 

(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు కలిగిన విశాఖపట్నం విమానాశ్రయంలో భద్రతా వ్యవస్థ మూడు నెలలుగా పడకేసింది. విమానాశ్రయంలో సీసీ కెమెరాల ఫుటేజీ మూడు నెలలుగా లేదని స్వయంగా విశాఖ పోలీసులే హైకోర్టుకు నివేదించడం గమనార్హం. కీలకమైన ఎయిర్‌పోర్టులో నెలల తరబడి సీసీ కెమెరాలు ఆఫ్‌లో ఉన్నాయని పోలీసులు చెప్పడం అందరినీ విస్మయపరుస్తోంది. దొంగతనాలు, ఇతర నేరాల కట్టడికి అపార్టుమెంట్లు, చిన్న వ్యాపార సంస్థల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు తరచూ చెబుతుంటారు. అలాంటిది దేశ, విదేశ ప్రముఖులు, వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ముఖ్యమైన విమానాశ్రయంలో సీసీ కెమెరాలు కచ్చితంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే ధ్యాసే లేకపోవడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కావాలనే సీసీ కెమెరాలు  పనిచేయకుండా చేశారని, కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కుట్రలో భాగంగానే కెమెరాలు ఆఫ్‌.. 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మూడు నెలల క్రితం ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఆయన ప్రతి వారం విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ చివరినాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగియాల్సి ఉంది. అంటే ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు ఉత్తరాంధ్రలో పాదయాత్ర షెడ్యూల్‌ ఉన్నందున ప్రతిపక్ష నేత విశాఖపట్నం విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా దీన్నే అవకాశంగా మలుచుకుని ఆయన్ను హత్య చేసేందుకు ఏడాది క్రితం కుట్ర పన్నారు. విశాఖ విమానాశ్రయం కేంద్ర స్థానంగా.. ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ నిర్వాహకుడు, టీడీపీ నేత హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరి ద్వారా ఈ కథ నడిపించారు.

ఆయనతో విమానాశ్రయ భద్రతాధికారి వేణుగోపాల్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా వాడుకుని తమ పన్నాగాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఉపక్రమించారు. ఏడాది క్రితమే నిందితుడు శ్రీనివాసరావును రెస్టారెంట్‌ వెయిటర్‌ ముసుగులో విమానాశ్రయంలోకి ప్రవేశపెట్టారు. ఎయిర్‌పోర్టులో ప్రవేశించేందుకు అవసరమయ్యే ఎంట్రీ పాస్‌ లేకుండానే శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో మాటు వేశాడు. కుట్రలో భాగంగానే మూడు నెలల క్రితం విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. దీన్ని ఎవరు చేశారు...? ఎలా చేశారు? అనేది అంతుచిక్కకుండా జాగ్రత్త పడ్డారు. అందువల్లే సీసీ కెమెరాల ఫుటేజీలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి నియంత్రణలో ఉన్నాయి? అన్న హైకోర్టు ప్రశ్నలకు పోలీసులు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు.  

కెమెరాలు పనిచేస్తే బండారం బట్టబయలు.. 
విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన  హత్యాయత్నం వెనుక కుట్ర ఆధారసహితంగా వెంటనే బట్టబయలయ్యేదని పోలీసువర్గాలే చెబుతున్నాయి. హత్యాయత్నం జరిగిన అక్టోబరు 25వతేదీన నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయంలో ప్రవేశించడం, అతడికి సహకరించిన మరికొందరి చర్యలు, వీఐపీ లాంజ్‌వద్ద నిందితుడి ప్రవర్తన, అదను చూసి కత్తిదూయడం, ఆ వెంటనే నిందితుడికి సహకరించినవారి స్పందన మొదలైన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యి కేసులో కీలక  ఆధారాలు వెంటనే లభించేవి. వారిని విచారిస్తే ఈ కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల బండారం బహిర్గతమయ్యేది. ఈ పరిణామాలను ముందుగా ఊహించే మూడు నెలల ముందు నుంచే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని ఓ రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement