సాక్షి, తిరుపతి క్రైం : నగరంలోని పెద్దకాపు వీధిలో ఈ నెల 9న జరిగిన హత్యను 72 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కొడుకే తండ్రిని హత్య చేయించినట్టు తేల్చారు. డీఎస్పీ మునిరామయ్య శుక్రవారం ఈస్ట్ పోలీస్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న ఉదయం తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధిలో చందు లాడ్జ్ యజ మాని రావూరి సత్యనారాయణ హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
రక్త సంబందీకులే హత్యకు పాల్పడినట్టు తేలింది. మృతుడి పెద్ద కుమారుడు రావూరి చందు గతంలో తం డ్రితో ఆస్తి కోసం గొడవపడేవాడని తేలింది. కొంత కాలం గా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రూ.20 లక్షలతో చందు ఓ స్టేషనరీ షాపును నడుపుతుండేవాడు. వ్యా పారం సరిగా లేకపోవడంతో అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చలేక తండ్రితో తరచూ గొడవపడుతూ ఆస్తి పంచా లని డిమాండ్ చేసేవాడు. తండ్రి పట్టించుకోకపోవడంతో మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారమే హత్య..
తండ్రిని హత్య చేయాలని 15 రోజుల క్రితమే కొడుకు చందు నిర్ధారించుకున్నాడు. జిమ్‌లో పరిచయమైన పాకాల దినేష్‌కి విషయం చెప్పాడు. తన తండ్రిని చంపితే రూ.5 లక్షలు ఇస్తానని, నగరంలో పెద్ద బట్టల దుకాణాన్ని పెట్టిస్తానని ఆశ కల్పించాడు. దీంతో పాకాల దినేష్ హత్య చేసేందు కు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. దినేష్ తన స్నేహితుడు సాయికిరణ్‌కు రూ.3 లక్షలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు.
సాయికిరణ్ తన స్నేహితులైన గణేష్ అలియాస్ గని, హేమంత్ అలియాస్ విక్కి, భాస్కర్ అలియాస్ లోకేష్‌తో కలిసి 15 రోజులుగా రెక్కీ నిర్వహించారు. ఈ తరుణంలో ఈ నెల 9న వేకువజామున వాకింగ్ చేస్తున్న సత్యనారాయణను గమనించారు. అకస్మాత్తుగా కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. సత్యనారాయణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసును ఛేదించటంలో ఈస్ట్ సీఐ రామ్‌కిశోర్, సిబ్బంది కృషి చేశారని డీఎస్పీ తెలిపారు. వీరందరికీ రివార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment