మరియమ్మ మృతదేహం, నిందితుడు కిషోర్
బడేపురం(తాడికొండ): మాంసం కూర వండలేదని మద్యానికి బానిసైన ఓ కొడుకు కన్నతల్లిని కత్తితో పొడిచి చంపిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ శివారు బడేపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడేపురం గ్రామానికి చెందిన బెజ్జం కిషోర్ గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసై ఇంటి వద్దే ఉంటున్నాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో భార్య అతన్ని వదిలేసి ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రుల ఆసరాతో జీవిస్తున్నాడు. వృద్ధుడైన తండ్రి వెంకటేశ్వరరావు తాడికొండలో ఆర్‌ఎంపీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఆదివారం ఉదయం బయటికెళ్లిన కిషోర్ మద్యం తాగి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. మాంసం కూర వండలేదనే కారణంతో తల్లి బెజ్జం మరియమ్మ (70)తో వాగ్వాదానికి దిగాడు. ఆమె వంటకు ఏర్పాట్లు చేసుకుంటుండగా వెనుక నుంచి కూరలు తరిగే కత్తితో వీపుపై పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. విధి నిర్వహణలో భాగంగా బయటికి వెళ్లి వచ్చిన తండ్రి వెంకటేశ్వరరావు.. కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడటంతో నిశ్చేష్టుడయ్యాడు. ఘటనా స్థలాన్ని మంగళగిరి రూరల్ సీఐ మధుసూదనరావు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆస్తి ఇవ్వలేదనే చంపేశాడు..
ఆస్తి కోసమే తన కుమారుడు తల్లిని చంపేశాడని నిందితుడు బెజ్జం కిషోర్ తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం నిత్యం వేధిస్తుండటంతో గతంలోనే పిల్లలకు పంపకాలు చేసి ఆస్తిని రాసిచ్చినట్టు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన కొడుకు ఆస్తిని దుర్వినియోగం చేస్తాడనే ఉద్దేశంతో మనుమలు, మనుమరాళ్ల పేరిట ఆస్తిని రాసినట్టు వివరించారు. ఇంతలోనే తల్లిని ఇలా హత్యచేస్తాడని ఊహించలేదని ఆయన కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment