
సంఘటనా ప్రదేశం వద్ద పోలీసులు
మత్తు పదార్థాలకు అలవాటుపడి.. వ్యసనాన్ని వదులుకోమన్న తండ్రిని విచక్షణా రహితంగా.. అడ్డువచ్చిన సోదరుడిపై కూడా దాడి చేయటంతో.. చివరకు సోదరుడి చేతిలోనే..
పాట్నా : మత్తు పదార్థాలకు అలవాటుపడి.. వ్యసనాన్ని వదులుకోమన్న తండ్రిని విచక్షణా రహితంగా కొట్టి చంపాడో కొడుకు. అడ్డువచ్చిన సోదరుడిపై కూడా దాడి చేయటంతో.. చివరకు సోదరుడి చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బీహార్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌లోని హర్‌దోయ్ గ్రామానికి చెందిన మురళి(60), నన్హే(20), వీరేందర్(38) ఆరేళ్ల క్రితం ఘజియాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఈ ముగ్గురు దినసరి కూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మురళి చిన్న కొడుకు నన్హే మత్తు పదార్థాలకు అలవాటుపడ్డాడు. తండ్రి, సోదరుడు ఎంత చెప్పినా వినపించుకోలేదు. చెడు సావాసాలనుంచి అతన్ని తప్పించటానికి మేకలు మేపే పని అప్పగించాలని భావించిన అతని తండ్రి, అన్నలు రెండు మేకలు తెప్పించారు.
మంగళవారం రోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మత్తు పదార్థాలు తీసుకుంటున్న నన్హేను గమనించిన తండ్రి అతన్ని మందలించాడు. దీంతో ఆగ్రహించిన అతడు తండ్రిపై తిరగబడి ఇటుకతో దాడి చేశాడు. అడ్డుగా వచ్చిన సోదరుడు వీరేందర్‌పై కూడా అతడు దాడికి తెగబడ్డాడు. దెబ్బలకు తాళలేక కింద పడిపోయిన తండ్రిని నన్హే కర్రతో దారుణంగా బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కాగా అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం నన్హే.. వీరేందర్‌పై కూడా దాడికి సిద్దమవటంతో ప్రతిఘటించిన వీరేందర్ కర్రతో కొట్టి అతన్ని చంపేశాడు. కొద్దిసేపటి తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వీరేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మరక్షణ కోసమే సోదరునిపై దాడి చేశానని వీరేందర్ తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.