సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ లీగల్,
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన 9నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనలో కామాంధుడు, ఉన్మాది ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో విచారణ జరిపిన వరంగల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి.. కామోన్మాదికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఘటన జరిగిన 48 రోజుల్లో విచారణ పూర్తయి.. తీర్పు వెలువడడంతో కేసు విచారణ, ఆధారాల సేకరణలో వరంగల్ పోలీసుల కృషి ఫలించినట్ల యింది. ఈ కేసులో నింది తుడైన పోలెపాక ప్రవీణ్ అలియాస్ పవన్ గత జూన్ 18న రాత్రి తల్లి పొత్తిళ్లలో పడుకున్న పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత మార్చి నట్లు హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి గత నెల 24న ప్రారంభమైన విచారణ ఈనెల 2న ముగిసింది. పోలీ సులు సవాల్‌గా తీసుకొని 20 రోజుల్లోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 51 మంది సాక్షుల్లో అవసరమున్న 30 మందిని కోర్టులో హాజరుపరి చారు. ప్రవీణ్‌ను దోషిగా నిర్ధారించిన వరంగల్ జిల్లా అదనపు కోర్టు న్యాయ మూర్తి కె.జయకుమార్ ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
ఏం జరిగింది?
రాష్ట్రంలో దిగ్భ్రాంతి కలిగించిన చిన్నారి అత్యాచారం, హత్య కేసు విచారణకు సంబంధించి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోకిల సత్యనారాయణగౌడ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో విద్యాభారతి ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసే కామోజు జంగయ్య–రచన దంపతులు తమ 9 నెలల కూతురుశ్రీహితను తీసుకొని హన్మకొండ కుమార్‌పల్లిలో ఉన్న శ్రీహిత అమ్మమ్మ ఇంటికి వచ్చారు. 18 జూన్ 2019న రాత్రి భోజనాలు చేసిన తర్వాత పడుకోవడానికి బంగ్లాపైకి వెళ్లారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో కుమార్‌పల్లిలో నివసిస్తున్న శాయంపేట మండలం వసంతపురం గ్రామానికి చెందిన పోలెపాక ప్రవీణ్.. కుమార్‌పల్లిలో ఉన్న జంపాల భరత్ కుమార్, రాజు (శ్రీహిత మేనమామలు)ల ఇల్లు గేటు వేసి ఉండటం చూసి దూకి లోపలకు వెళ్లాడు. ఇంటి తలుపులు వేసి ఉండగా మేడపైకి వెళ్లడానికి తలుపులు తీసి ఉన్నాయి. పైకి వెళ్లి చూడగా అందరూ గాఢనిద్రలో ఉన్నారు. అక్కడ కనిపించిన రెండు సెల్‌ఫోన్లు దొంగలించాక మద్యం మత్తులో అతనికి నిద్రిస్తున్న మహిళలను అనుభవించాలని అలోచన వచ్చింది. కానీ భయం వేసి కాసేపు నిలబడిపోయాడు. అప్పుడు అమ్మ పక్కన నిద్రిస్తున్న చిన్నారి పాపపై కన్ను పడిన కామాంధుడు, తన కోరిక తీర్చుకోవడానికి ఆ పాపను తీసుకొని కిందకు వచ్చాడు. పక్క వీధిలో చీకట్లో ఎవ్వరూ లేని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి తన మోకాళ్లపై పసికందును కూర్చోబెట్టుకుని అత్యాచారం చేశారు. నొప్పి భరించలేక చిన్నారి కేకలు వేయడంతో ఎవ్వరైనా వస్తారేమోనని భయపడ్డ కామాంధుడు అభం శుభం తెలియని పసిపాప నోరు, ముక్కు మూసేశాడు.
దీంతో ఊపిరాడక పాప మృతి చెందింది. పాప మరణించిందని నిర్ధారించుకున్న నిందితుడు ప్రవీణ్ శవాన్ని ఎక్కడైనా పడేద్దామని నిర్ణయించుకొని బట్టల్లో చుట్టుకొని భుజంపై వేసుకొని రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో ముగ్గురు, నలుగురు తనవైపు వస్తున్నారని గుర్తించిన ప్రవీణ్ పాపను అక్కడే పడేసి పారిపోవడానికి యత్నించగా చిన్నారి శ్రీహిత మేనమామ భరత్ కుమార్ ఇతర బంధువులు, వీధిలోని యువకులు వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా, చిన్నారి తల్లి రచన పాపను తీసుకొని హన్మకొండ మ్యాక్స్‌కేర్ హాస్పిటల్‌కు వెళ్లింది. వైద్యులు చిన్నారిని పరిశీలించి మృతిచెందిందని నిర్ధారించారు. దీంతో శ్రీహిత మేమమామ భరత్ కుమార్ ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు ప్రవీణ్‌పై ఐపీసీ సెక్షన్ 449, 379, 376, 376 (ఏ–బీ) పోక్సో చట్టంలోని 5, 6 సెక్షన్లు.. ఐపీసీ సెక్షన్ 302 హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. విచారణలో 51 మంది సాక్షులకుగానూ 30 మంది సాక్షులను విచారించిన కోర్టు.. నేరం రుజువు కావడంతో వివిధ సెక్షన్ల క్రింద రెండేళ్ల నుండి యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధిస్తూ రూ.5వేల జరిమానా విధించింది. అలాగే, ఐపీసీ సెక్షన్ 302 హత్యా నేరం కింద మరణించే వరకు ఉరి తీయాలని జడ్జి జయకుమార్ సంచలన తీర్పు వెల్లడించారు.
48 రోజుల్లో వెలువడిన తీర్పు
నగరం నడిబొడ్డున పసికందుపైన జరిగిన అమానుష ఘటనలో.. సంచలనాత్మకంగా నేరం జరిగిన 48 రోజుల్లో నేరస్తుడికి ఉరిశిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి జయకుమార్ తీర్పు ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ప్రజాసంఘాలు విద్యార్థులు, మహిళలు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపైకి వచ్చి నినదించారు. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు రావడం.. మరీ ముఖ్యంగా తక్కువ సమయంలో విచారణ జరిపడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 18 జూన్ 2019న అర్ధరాత్రి నేరం జరగ్గానే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎలాంటి ఆలస్యం చేయకుండా పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. అన్ని కోణాల నుండి సాక్ష్యాధారాలు సేకరించారు. పకడ్బందీగా 27 రోజుల్లో (11 జూలై 2019న) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పోక్సో కేసుల విచారణ ప్రత్యేక కోర్టు కూడా అయిన మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి జయకుమార్ విచారణ వేగవంతం చేయాలనే సంకల్పంతో జూలై 24, 25, 30, 31తో పాటు ఆగస్టు 1, 2 తేదీల్లో సాక్షులను విచారించారు. ఆగస్టు 6న మంగళవారం రోజు వాదనలను విన్న న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు.
15 సంవత్సరాల తర్వాత ‘ఉరి’
వరంగల్ జిల్లా కోర్టు చరిత్రలో 15 వసంతాలు ముగిసిన అనంతరం ఒకరికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. గతంలో 2004లో స్టేషన్‌ఘన్‌పూర్ పోలీసుస్టేషన్‌లో నమోదైన హత్యానేరం కేసులో నాటి మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి మోహన్‌గాంధీ.. నిందితుడికి ఉరిశిక్ష విధించారు. మళ్లీ 15 ఏళ్లతర్వాత చిన్నారి శ్రీహితపై అత్యాచారం చేసి హత్య చేసిన నేరస్తుడు పోలెపాక ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ జడ్జి జయకుమార్ తీర్పునిచ్చారు. 2004 కేసులో సుప్రీం కోర్టు ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా అప్పీల్‌తో మార్పు చేసింది. దీనికి ముందు నర్సంపేటలో జరిగిన హత్య కేసులో సైతం విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా అత్యున్నత న్యాయస్థానం ధృవీకరించింది.
ఆహ్వానించదగిన తీర్పు
పసిపాపపై పాశవికంగా అత్యాచారం, హత్యకు పాల్పడిన నేరస్తునికి ఉరిశిక్ష పడటం ఆహ్వానించదగ్గ తీర్పు. స్త్రీలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాల నియంత్రణకు ఇలాంటి తీర్పులు దోహదపడతాయి. తెలంగాణలో ముఖ్యంగా.. వరంగల్‌లో పోక్సో చట్టం క్రింద ఉరిశిక్ష పడిన మొదటి కేసును ప్రాసిక్యూషన్ పక్షాన నేను వాదించినందుకు ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా తీర్పు వెల్లడించిన తర్వాత న్యాయవాదులు, మహిళల్లో కనిపించిన సానుకూలత నన్నెంతో ఉత్తేజితుడిని చేసింది. బాధిత కుటుంబాలు ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెబితే నేరస్తులకు శిక్ష పడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
– మోకిల సత్యనారాయణగౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్
నేరం చేయలేదు.. మద్యం మత్తులో ఉన్నానంతే!
తాను మద్యం మత్తులో ఉన్నానని.. అంతకుమించి ఎలాంటి నేరమూ చేయలేదని నిందితుడు ప్రవీణ్ కోర్టు ముందు కన్నీరు కారుస్తూ చెప్పాడు. శిక్ష విధించే ముందు జడ్జి జయకుమార్.. నిందితుడిపై ప్రాసిక్యూషన్ నమోదు చేసిన నేరారోపణలు చెప్పి.. అవన్నీ నువ్వు చేసినట్లు నిర్ధారణ అయ్యాయని చెప్పారు. దీనిపై ప్రవీణ్ మాట్లాడుతూ.. తాను తప్పు చేయలేదన్నాడు. అంతకు 2రోజుల ముందు జరిగిన విచారణలో ముద్దాయి తరఫున కోర్టు నియమించిన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ప్రాసిక్యూషన్ వారు సత్వరమే కేసు విచారణ ముగించాలనే ఉద్దేశంతో తప్పుడు నేరారోపణలు చేస్తున్నారని, కల్పిత సాక్ష్యాలతో నిందితుడిపై నేర నిరూపణకు పూనుకుంటున్నారని అన్నారు. కాగా, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ నిందితుడి పక్షాన న్యాయవాదులు ఎవరూ వాదించకూడదని నిర్ణయించడంతో నిష్పక్షపాత విచారణ నిమిత్తం కోర్టు నిందితుడి పక్షాన న్యాయవాదిని నియమించిన విషయం తెలిసిందే. కాగా, శ్రీహిత మేనమామ జంపాల రాజ్‌కుమార్ ఇంటిముందున్న సీసీటీవీ ఫుటేజీ.. ఈ కేసు విచారణలో కీలకంగా మారిన నేపథ్యంలో ఆయన్ను న్యాయమూర్తి అభినందించారు. సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు.
వరంగల్ పోలీస్ శభాష్!
9నెలల పసికందుపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించటడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో విచారణ పూర్తి చేసుకున్న కేసుగా ఇది రికార్డులకెక్కింది. ఘటన జరిగిన 50 రోజుల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడటం, ఒక విశేషమయితే, విచారణ మొదలెట్టిన 21 రోజుల్లోనే పూర్తవడం చరిత్రాత్మకమని న్యాయనిపుణులంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను అత్యంతవేగంగా పూర్తి చేసిన వరంగల్ పోలీసులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పోలీసులను అభినందించారు. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష వేయడాన్ని స్వాగతించారు. కేసు విచారణలో, ఆధారాల సేకరణ, న్యాయస్థానంలో విచారణ వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించిన వరంగల్ సీపీ రవీందర్, దర్యాప్తు అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. న్యాయస్థానం తీర్పును ఆయన స్వాగతించారు. విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా (లా అండ్ ఆర్డర్) బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment