srihitha
-
ఉరి శిక్ష అవసరం లేదు.. యావజ్జీవం చాలు
హన్మకొండ చౌరస్తా: తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి శ్రీహితను ఎత్తుకెళ్లి అత్యాచారం, ఆపై హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరి శిక్ష అవసరం లేదని, యావజ్జీవం చాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మొదట ఈ కేసును విచారించిన జిల్లా కోర్టు ఉరి శిక్ష విధించగా.. హైకోర్టు యావజ్జీవ శిక్ష సరిపోతుందని తీర్పు చెప్పింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. వివరాలు.. 2019 జూన్ 19న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుమార్‌పల్లిలో పోలేపాక ప్రవీణ్.. 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే. అప్పట్లో స్వచ్చంద సంస్థలు, పలు పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. ప్రవీణ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేశాయి. కాగా, ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ పకడ్బందీగా ఆధారాలను సేకరించి జిల్లా న్యాయస్థానం ముందుంచారు. అదే ఏడాది ఆగస్టు 8న నిందితుడు ప్రవీణ్‌కు ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరిచింది. దీంతో ప్రజలు సంతోషించారు. (వరంగల్ శ్రీహిత హత్యకేసులో తీర్పు) ఇంతలోనే అనూహ్యంగా హైకోర్టు ప్రవీణ్‌కు ఉరి శిక్ష అవసరం లేదని, యావజ్జీవ శిక్ష సరిపోతుందని తీర్పు చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాదాపు 8 నెలల అనంతరం సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. నిందితుడికి ఉరి శిక్ష విధిస్తేనే సమాజంలో నేరస్తులకు సరైన సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. తుదిశ్వాస విడిచే వరకు జైలు శిక్ష కూడా సరైన సంకేతాలనే సమాజంలోకి పంపుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కిషన్కౌల్తో కూడిన ధర్మాసనం ఈనెల 14న లిఖితపూర్వక ఆదేశాలను విడుదల చేసింది. కాగా సుప్రీం తీర్పు తమను ఎంతో బాధించిందని చిన్నారి శ్రీహిత తల్లిదండ్రులు కామోజు జగన్ – రచన ఆవేదన వ్యక్తం చేశారు. పాపపై అఘాయిత్యానికి ఒడిగట్టిన మానవ మృగానికి నిర్భయ దోషుల మాదిరిగా ఉరి శిక్ష వేస్తే న్యాయం జరిగినట్లు భావించే వారమని పేర్కొన్నారు. -
ఆ మానవ మృగాన్ని ఇంకా మేపుతారా?
హన్మకొండ చౌరస్తా : ముక్కు పచ్చలారని 9 నెలల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని ఆరు నెలలుగా జైలులో ఉంచి మేపుతూ తమను క్షోభ పెడుతున్నారని హన్మకొండకు చెందిన చిన్నారి శ్రీహిత తల్లి రచన ఆవేదన వ్యక్తం చేశారు. దిశ హంతకుల ఎన్కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ఆమె హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. తామేం ఏం పాపం చేశామని ప్రభుత్వం అన్యాయం చేస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు. ఒడిలో నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లి అత్యంత కిరాతకానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని ఉరితీయాలని జిల్లా కోర్టు తీర్పు ఇస్తే.. హైకోర్టు ఈ తీర్పును యావజ్జీవ శిక్షగా మార్చడం తమను బాధించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలని.. అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని.. పాప ఆత్మకు శాంతి చేకూరుతుందని రచన తెలిపారు. -
సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం
హన్మకొండ చౌరస్తా: పసిపాపపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడికి విధించిన ఉరి శిక్షను తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందని చిన్నారి శ్రీహిత తండ్రి కె.జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కుమార్‌పల్లిలో జూన్ 17 రాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న శ్రీహితను నిందితుడు ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆయన ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేశ సర్వోత్తమ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నాడు. -
ఉన్మాదికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ లీగల్, సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన 9నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనలో కామాంధుడు, ఉన్మాది ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో విచారణ జరిపిన వరంగల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి.. కామోన్మాదికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఘటన జరిగిన 48 రోజుల్లో విచారణ పూర్తయి.. తీర్పు వెలువడడంతో కేసు విచారణ, ఆధారాల సేకరణలో వరంగల్ పోలీసుల కృషి ఫలించినట్ల యింది. ఈ కేసులో నింది తుడైన పోలెపాక ప్రవీణ్ అలియాస్ పవన్ గత జూన్ 18న రాత్రి తల్లి పొత్తిళ్లలో పడుకున్న పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత మార్చి నట్లు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి గత నెల 24న ప్రారంభమైన విచారణ ఈనెల 2న ముగిసింది. పోలీ సులు సవాల్‌గా తీసుకొని 20 రోజుల్లోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 51 మంది సాక్షుల్లో అవసరమున్న 30 మందిని కోర్టులో హాజరుపరి చారు. ప్రవీణ్‌ను దోషిగా నిర్ధారించిన వరంగల్ జిల్లా అదనపు కోర్టు న్యాయ మూర్తి కె.జయకుమార్ ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఏం జరిగింది? రాష్ట్రంలో దిగ్భ్రాంతి కలిగించిన చిన్నారి అత్యాచారం, హత్య కేసు విచారణకు సంబంధించి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోకిల సత్యనారాయణగౌడ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో విద్యాభారతి ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసే కామోజు జంగయ్య–రచన దంపతులు తమ 9 నెలల కూతురుశ్రీహితను తీసుకొని హన్మకొండ కుమార్‌పల్లిలో ఉన్న శ్రీహిత అమ్మమ్మ ఇంటికి వచ్చారు. 18 జూన్ 2019న రాత్రి భోజనాలు చేసిన తర్వాత పడుకోవడానికి బంగ్లాపైకి వెళ్లారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో కుమార్‌పల్లిలో నివసిస్తున్న శాయంపేట మండలం వసంతపురం గ్రామానికి చెందిన పోలెపాక ప్రవీణ్.. కుమార్‌పల్లిలో ఉన్న జంపాల భరత్ కుమార్, రాజు (శ్రీహిత మేనమామలు)ల ఇల్లు గేటు వేసి ఉండటం చూసి దూకి లోపలకు వెళ్లాడు. ఇంటి తలుపులు వేసి ఉండగా మేడపైకి వెళ్లడానికి తలుపులు తీసి ఉన్నాయి. పైకి వెళ్లి చూడగా అందరూ గాఢనిద్రలో ఉన్నారు. అక్కడ కనిపించిన రెండు సెల్ఫోన్లు దొంగలించాక మద్యం మత్తులో అతనికి నిద్రిస్తున్న మహిళలను అనుభవించాలని అలోచన వచ్చింది. కానీ భయం వేసి కాసేపు నిలబడిపోయాడు. అప్పుడు అమ్మ పక్కన నిద్రిస్తున్న చిన్నారి పాపపై కన్ను పడిన కామాంధుడు, తన కోరిక తీర్చుకోవడానికి ఆ పాపను తీసుకొని కిందకు వచ్చాడు. పక్క వీధిలో చీకట్లో ఎవ్వరూ లేని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి తన మోకాళ్లపై పసికందును కూర్చోబెట్టుకుని అత్యాచారం చేశారు. నొప్పి భరించలేక చిన్నారి కేకలు వేయడంతో ఎవ్వరైనా వస్తారేమోనని భయపడ్డ కామాంధుడు అభం శుభం తెలియని పసిపాప నోరు, ముక్కు మూసేశాడు. దీంతో ఊపిరాడక పాప మృతి చెందింది. పాప మరణించిందని నిర్ధారించుకున్న నిందితుడు ప్రవీణ్ శవాన్ని ఎక్కడైనా పడేద్దామని నిర్ణయించుకొని బట్టల్లో చుట్టుకొని భుజంపై వేసుకొని రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో ముగ్గురు, నలుగురు తనవైపు వస్తున్నారని గుర్తించిన ప్రవీణ్ పాపను అక్కడే పడేసి పారిపోవడానికి యత్నించగా చిన్నారి శ్రీహిత మేనమామ భరత్ కుమార్ ఇతర బంధువులు, వీధిలోని యువకులు వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా, చిన్నారి తల్లి రచన పాపను తీసుకొని హన్మకొండ మ్యాక్స్‌కేర్ హాస్పిటల్‌కు వెళ్లింది. వైద్యులు చిన్నారిని పరిశీలించి మృతిచెందిందని నిర్ధారించారు. దీంతో శ్రీహిత మేమమామ భరత్ కుమార్ ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు ప్రవీణ్‌పై ఐపీసీ సెక్షన్ 449, 379, 376, 376 (ఏ–బీ) పోక్సో చట్టంలోని 5, 6 సెక్షన్లు.. ఐపీసీ సెక్షన్ 302 హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. విచారణలో 51 మంది సాక్షులకుగానూ 30 మంది సాక్షులను విచారించిన కోర్టు.. నేరం రుజువు కావడంతో వివిధ సెక్షన్ల క్రింద రెండేళ్ల నుండి యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధిస్తూ రూ.5వేల జరిమానా విధించింది. అలాగే, ఐపీసీ సెక్షన్ 302 హత్యా నేరం కింద మరణించే వరకు ఉరి తీయాలని జడ్జి జయకుమార్ సంచలన తీర్పు వెల్లడించారు. 48 రోజుల్లో వెలువడిన తీర్పు నగరం నడిబొడ్డున పసికందుపైన జరిగిన అమానుష ఘటనలో.. సంచలనాత్మకంగా నేరం జరిగిన 48 రోజుల్లో నేరస్తుడికి ఉరిశిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి జయకుమార్ తీర్పు ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ప్రజాసంఘాలు విద్యార్థులు, మహిళలు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపైకి వచ్చి నినదించారు. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు రావడం.. మరీ ముఖ్యంగా తక్కువ సమయంలో విచారణ జరిపడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 18 జూన్ 2019న అర్ధరాత్రి నేరం జరగ్గానే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎలాంటి ఆలస్యం చేయకుండా పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. అన్ని కోణాల నుండి సాక్ష్యాధారాలు సేకరించారు. పకడ్బందీగా 27 రోజుల్లో (11 జూలై 2019న) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పోక్సో కేసుల విచారణ ప్రత్యేక కోర్టు కూడా అయిన మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి జయకుమార్ విచారణ వేగవంతం చేయాలనే సంకల్పంతో జూలై 24, 25, 30, 31తో పాటు ఆగస్టు 1, 2 తేదీల్లో సాక్షులను విచారించారు. ఆగస్టు 6న మంగళవారం రోజు వాదనలను విన్న న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు. 15 సంవత్సరాల తర్వాత ‘ఉరి’ వరంగల్ జిల్లా కోర్టు చరిత్రలో 15 వసంతాలు ముగిసిన అనంతరం ఒకరికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. గతంలో 2004లో స్టేషన్‌ఘన్‌పూర్ పోలీసుస్టేషన్లో నమోదైన హత్యానేరం కేసులో నాటి మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి మోహన్‌గాంధీ.. నిందితుడికి ఉరిశిక్ష విధించారు. మళ్లీ 15 ఏళ్లతర్వాత చిన్నారి శ్రీహితపై అత్యాచారం చేసి హత్య చేసిన నేరస్తుడు పోలెపాక ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ జడ్జి జయకుమార్ తీర్పునిచ్చారు. 2004 కేసులో సుప్రీం కోర్టు ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా అప్పీల్‌తో మార్పు చేసింది. దీనికి ముందు నర్సంపేటలో జరిగిన హత్య కేసులో సైతం విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా అత్యున్నత న్యాయస్థానం ధృవీకరించింది. ఆహ్వానించదగిన తీర్పు పసిపాపపై పాశవికంగా అత్యాచారం, హత్యకు పాల్పడిన నేరస్తునికి ఉరిశిక్ష పడటం ఆహ్వానించదగ్గ తీర్పు. స్త్రీలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాల నియంత్రణకు ఇలాంటి తీర్పులు దోహదపడతాయి. తెలంగాణలో ముఖ్యంగా.. వరంగల్‌లో పోక్సో చట్టం క్రింద ఉరిశిక్ష పడిన మొదటి కేసును ప్రాసిక్యూషన్ పక్షాన నేను వాదించినందుకు ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా తీర్పు వెల్లడించిన తర్వాత న్యాయవాదులు, మహిళల్లో కనిపించిన సానుకూలత నన్నెంతో ఉత్తేజితుడిని చేసింది. బాధిత కుటుంబాలు ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెబితే నేరస్తులకు శిక్ష పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. – మోకిల సత్యనారాయణగౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేరం చేయలేదు.. మద్యం మత్తులో ఉన్నానంతే! తాను మద్యం మత్తులో ఉన్నానని.. అంతకుమించి ఎలాంటి నేరమూ చేయలేదని నిందితుడు ప్రవీణ్ కోర్టు ముందు కన్నీరు కారుస్తూ చెప్పాడు. శిక్ష విధించే ముందు జడ్జి జయకుమార్.. నిందితుడిపై ప్రాసిక్యూషన్ నమోదు చేసిన నేరారోపణలు చెప్పి.. అవన్నీ నువ్వు చేసినట్లు నిర్ధారణ అయ్యాయని చెప్పారు. దీనిపై ప్రవీణ్ మాట్లాడుతూ.. తాను తప్పు చేయలేదన్నాడు. అంతకు 2రోజుల ముందు జరిగిన విచారణలో ముద్దాయి తరఫున కోర్టు నియమించిన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ప్రాసిక్యూషన్ వారు సత్వరమే కేసు విచారణ ముగించాలనే ఉద్దేశంతో తప్పుడు నేరారోపణలు చేస్తున్నారని, కల్పిత సాక్ష్యాలతో నిందితుడిపై నేర నిరూపణకు పూనుకుంటున్నారని అన్నారు. కాగా, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ నిందితుడి పక్షాన న్యాయవాదులు ఎవరూ వాదించకూడదని నిర్ణయించడంతో నిష్పక్షపాత విచారణ నిమిత్తం కోర్టు నిందితుడి పక్షాన న్యాయవాదిని నియమించిన విషయం తెలిసిందే. కాగా, శ్రీహిత మేనమామ జంపాల రాజ్‌కుమార్ ఇంటిముందున్న సీసీటీవీ ఫుటేజీ.. ఈ కేసు విచారణలో కీలకంగా మారిన నేపథ్యంలో ఆయన్ను న్యాయమూర్తి అభినందించారు. సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. వరంగల్ పోలీస్ శభాష్! 9నెలల పసికందుపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించటడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో విచారణ పూర్తి చేసుకున్న కేసుగా ఇది రికార్డులకెక్కింది. ఘటన జరిగిన 50 రోజుల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడటం, ఒక విశేషమయితే, విచారణ మొదలెట్టిన 21 రోజుల్లోనే పూర్తవడం చరిత్రాత్మకమని న్యాయనిపుణులంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను అత్యంతవేగంగా పూర్తి చేసిన వరంగల్ పోలీసులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పోలీసులను అభినందించారు. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష వేయడాన్ని స్వాగతించారు. కేసు విచారణలో, ఆధారాల సేకరణ, న్యాయస్థానంలో విచారణ వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించిన వరంగల్ సీపీ రవీందర్, దర్యాప్తు అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. న్యాయస్థానం తీర్పును ఆయన స్వాగతించారు. విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా (లా అండ్ ఆర్డర్) బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. -
ఆ మృగానికి సరైన శిక్షే పడింది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో ముద్దాయి ప్రవీణ్ కుమార్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చిన్నారి శ్రీహితపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్ అదనపు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటువంటి కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు. ఈ కేసులో చిన్నారి తరఫున వాదించిన న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. Death penalty verdict by court of law for the animal who molested a child in Warangal is a welcome judgement👏 We need more stringent laws and fast track courts to take these horrendous offenders off our streets My compliments to the advocates who fought hard👍#JusticePrevails — KTR (@KTRTRS) August 8, 2019 పోలీసులకు కృతజ్ఞతలు: శ్రీహిత తల్లిదండ్రులు తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించడంతో శ్రీహిత తల్లిదండ్రులు రచన, జగన్‌లు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్‌ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడికి మరణశిక్ష పడటానికి వరంగల్ పోలీసులు, కమిషనర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. 48 రోజుల్లో నిందితుడికి మరణ శిక్ష ఖరారు కావడంతో వరంగల్ పోలీసులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారని తెలిపారు. నేరాలకు పాల్పడే వారికి ఈ తీర్పు ఓ హెచ్చరికగా నిలవాలని వారు కోరుకున్నారు. -
వరంగల్ కోర్టు తీర్పును స్వాగతించిన నాయీలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు తీర్పును తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక స్వాగతించింది. నేరం జరిగిన 48రోజుల్లోనే కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించడం అభినందనీయమని ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం అన్నారు. అతి తక్కువ సమయంలోనే కేసును పరిష్కరించి, హంతకుడికి శిక్షపడేలా చేసిన పోలీసులు, న్యాయవ్యవస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీహిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు. హామీలు అమలు చేయాలి నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని మద్దికుంట లింగం గుర్తు చేశారు. సెలూన్లకు విద్యుత్, కళ్యాణకట్ట ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై సీఎం స్వయంగా హామీయిచ్చినా ఇంతవరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్లో కేటాయించిన రూ.250 కోట్లు ఇప్పటివరకు మంజూరు చేయలేదని తెలిపారు. తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
వరంగల్ శ్రీహిత హత్యకేసులో సంచలన తీర్పు
సాక్షి, వరంగల్: నగరంలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది నెలల పసికందుపై అమానుషంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన మానవమృగం ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జి జయకుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై జూన్ 18న నిందితుడు ప్రవీణ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నేరం జరిగిన 48రోజుల్లోనే కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించడం గమనార్హం. సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో అత్యంత కిరాతకంగా వ్యవహరించిన ప్రవీణ్ తరఫున ఎవరు వాదించరాదని వరంగల్ బార్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగింది..! మానవత్వమే కన్నీరు పెట్టింది. తాను మనిషిని అని మరిచిన ప్రవీణ్ అనే మృగం.. అభం శుభం తెలియని తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంగళవారం అర్ధరాత్రి (జూన్ 18న) ఈ ఘటన చోటుచేసుకుంది. హన్మకొండలోని కుమార్‌పల్లి జెండా ప్రాంతానికి చెందిన జంపాల యాదగిరి, నిర్మల దంపతులకు కుమారులు భరత్, నరసింహరాజుతో పాటు కుమార్తె రచన సంతానం. రచనను మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీప మాడుగుల గ్రామానికి చెందిన కమ్మోజీ జగన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల శ్రీహిత ఉంది. పాప ఆధార్ కార్డు నమోదు కోసం ఈ నెల 17న కూతురుని తీసుకుని హన్మకొండలోని తల్లిగారింటికి రచన భర్త జగన్‌తో వచ్చింది. మరుసటి రోజు ఆధార్ సెంటర్‌కు వెళ్లగా జనం అధికంగా ఉండటంతో మరుసటి రోజు రావాలని నిర్వాహకులు సూచించారు. అయితే జగన్‌కు ఆఫీసులో అత్యవసర పని ఉండటంతో భార్య, కుమార్తెను ఇక్కడే ఉంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అర్ధరాత్రి అపహరణ రాత్రి భోజనం చేశాక నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత రచనకు మెలకువ రాగా పక్కనే పాప శ్రీహిత లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్ బైక్‌పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ఓ వ్యక్తి భుజాన టవల్లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ఆ మానవ మృగం భరత్‌ను చూసి పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, దుండగుడిని పట్టుకున్న భరత్ చితకబాదాడు. చిన్నారిని చూసేసరికి ఎలాంటి కదలిక లేకపోవడం.. శరీరం నుంచి అధిక రక్తస్రావం కావడాన్ని గుర్తించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి శ్రీహితను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా ఏడ్చారు. పంచనామా చేసిన హన్మకొండ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం చేసి ఆపై హత్య శ్రీహిత మృతదేహానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యనిపుణుడు డాక్టర్ రజాం అలీఖాన్ వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నివేదికలో తేలిందని పేర్కొన్నారు. అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు తేలిందని తెలిపారు. ఈ ఘటనలో చిన్నారి తలపై రెండు ప్రదేశాల్లో గాయాలైనట్లు నిర్ధారించారు. -
వండర్ బుక్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీహిత
కాకినాడ కల్చరల్ : భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారి వక్కలంక శ్రీహిత.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్్డ్సలో చోటు సంపాదించింది. ఈమేరకు ఆమకు ఆ సంస్థల ప్రతినిధి అలమండ ప్రసాద్ గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్థానిక అశోక్‌నగర్‌లోని శ్రీసాయిబాబా మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శ్రీహిత ఐదో సంవత్సరం నుంచీ నాట్యంలో శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రదర్శనలు ఇచ్చిందన్నారు. నాట్య శిక్షకురాలు శ్రీవాణి మాట్లాడుతూ శ్రీహిత పట్టుదలతో నాట్యరంగంలో రాణిస్తోందన్నారు. ఈ అవార్డు పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని శ్రీహిత అన్నారు. కార్యక్రమంలో శ్రీహిత తల్లిదండ్రులు వక్కలంక వీరభద్రరావు, సత్యవాణి దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ వేదుల అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు.