సాక్షి, వరంగల్: నగరంలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది నెలల పసికందుపై అమానుషంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన మానవమృగం ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జి జయకుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై జూన్ 18న నిందితుడు ప్రవీణ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నేరం జరిగిన 48రోజుల్లోనే కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించడం గమనార్హం. సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో అత్యంత కిరాతకంగా వ్యవహరించిన ప్రవీణ్ తరఫున ఎవరు వాదించరాదని వరంగల్ బార్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగింది..!
మానవత్వమే కన్నీరు పెట్టింది. తాను మనిషిని అని మరిచిన ప్రవీణ్ అనే మృగం.. అభం శుభం తెలియని తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంగళవారం అర్ధరాత్రి (జూన్ 18న) ఈ ఘటన చోటుచేసుకుంది. హన్మకొండలోని కుమార్‌పల్లి జెండా ప్రాంతానికి చెందిన జంపాల యాదగిరి, నిర్మల దంపతులకు కుమారులు భరత్, నరసింహరాజుతో పాటు కుమార్తె రచన సంతానం. రచనను మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీప మాడుగుల గ్రామానికి చెందిన కమ్మోజీ జగన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల శ్రీహిత ఉంది. పాప ఆధార్ కార్డు నమోదు కోసం ఈ నెల 17న కూతురుని తీసుకుని హన్మకొండలోని తల్లిగారింటికి రచన భర్త జగన్‌తో వచ్చింది. మరుసటి రోజు ఆధార్ సెంటర్‌కు వెళ్లగా జనం అధికంగా ఉండటంతో మరుసటి రోజు రావాలని నిర్వాహకులు సూచించారు. అయితే జగన్‌కు ఆఫీసులో అత్యవసర పని ఉండటంతో భార్య, కుమార్తెను ఇక్కడే ఉంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు.
అర్ధరాత్రి అపహరణ
రాత్రి భోజనం చేశాక నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత రచనకు మెలకువ రాగా పక్కనే పాప శ్రీహిత లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్ బైక్‌పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ఓ వ్యక్తి భుజాన టవల్‌లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ఆ మానవ మృగం భరత్‌ను చూసి పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, దుండగుడిని పట్టుకున్న భరత్ చితకబాదాడు. చిన్నారిని చూసేసరికి ఎలాంటి కదలిక లేకపోవడం.. శరీరం నుంచి అధిక రక్తస్రావం కావడాన్ని గుర్తించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి శ్రీహితను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా ఏడ్చారు. పంచనామా చేసిన హన్మకొండ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అత్యాచారం చేసి ఆపై హత్య
శ్రీహిత మృతదేహానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యనిపుణుడు డాక్టర్ రజాం అలీఖాన్ వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నివేదికలో తేలిందని పేర్కొన్నారు. అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు తేలిందని తెలిపారు. ఈ ఘటనలో చిన్నారి తలపై రెండు ప్రదేశాల్లో గాయాలైనట్లు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment