warangal court
-
పదోతరగతి పేపర్ లీక్ కేసుపై నేడు తీర్పు
-
మెడికో ప్రీతి కేసు: కోర్టులో పోలీసులకు చుక్కెదురు!
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో సంచలనంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసు విషయమై కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. ప్రీతి మృతికి కారకుడిగా పేర్కొన్న నిందితుడు సైఫ్ పోలీస్ కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు అతడిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. మరో నాలుగు రోజుల పాటు సైఫ్‌ని కస్టడీలో ఉంచేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ రెండు రోజులు వాయిదా పడింది. బుధవారం విచారించిన కోర్టు పోలీసుల పిటిషన్‌ను తిరస్కరించింది. మరో వైపు ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీతిది హత్యా, ఆత్మహత్యా తేల్చుకోలేక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. చదవండి: ప్రీతి కేసు: కోర్టుకు సైఫ్.. డీజీపీ ఆఫీసుకు ప్రీతి పేరెంట్స్ -
Siricilla Rajaiah: సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట
సాక్షి, వరంగల్: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. రాజయ్య కోడలు సారిక ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు రాజయ్యను నిర్దోషిగా ప్రకటించింది. సారిక సూసైడ్ కేసులో.. రాజయ్య కొడుకు అనిల్, రాజయ్య, రాజయ్య భార్య మాధవిపైనా కేసు నమోదు అయ్యింది. ప్రధాన నిందితుడిగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్, రెండో నిందితుడిగా మాజీ ఎంపీ రాజయ్య, మూడవ నిందితురాలిగా రాజయ్య భార్య మాధవిపై అప్పట్లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది వరంగల్ కోర్టు. దీంతో రాజయ్య కుటుంబానికి ఊరట లభించింది. ఇదిలా ఉండగా.. ఎంపీ రాజయ్య కొడుకు అనిల్‌తో సారిక 2002, ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. పిల్లలు పుట్టాక భర్త అనిల్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని సారిక ఆరోపణలు దిగింది. మానసికంగా వేధించాడని, అయితే అత్త మామలు సర్ది చెప్పడంతో అతనితో కలిసి ఉంటున్నానని ఆమె వివరించారు. తాను గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్యకు యత్నించానని, అయినప్పటికీ వారిలో మార్పు రాలేదని ఆమె సంచలన ఆరోపణలు సైతం చేశారు. పిల్లల పోషణ కోసం సైతం డబ్బులివ్వడం లేదంటూ ఆమె అప్పట్లో పోరాటానికి దిగారు. సారికపై వేధింపుల కేసు పెండింగ్‌లో ఉండగానే.. 2015, నవంబర్4న ఆనూహ్యంగా సారికి, ముగ్గురు కొడుకులు అభినవ్, కవలలు అయోన్, శ్రీయోన్ మంటల్లో కాలి మృతి చెందారు. ఈ దుర్ఘటనపై సారిక కుటుంబ సభ్యుల అనుమానం మేరకు.. కేసు నమోదు చేసుకుని రాజయ్య కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వరకట్న వేధింపులు, అనిల్ రెండో భార్య సన వల్లే గొడవలు జరిగాయని ఆరోపించింది సారిక కుటుంబం. అయితే పోలీసులు మాత్రం సారిక బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇన్నేళ్ల విచారణ తర్వాత.. కోర్టు రాజయ్య కుటుంబాన్ని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై పైకోర్టును సారిక కుటుంబం ఆశ్రయిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. -
రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ ఘటన నిందితుడు రాజు మృతిపై తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు న్యాయస్థానం ఆదేశించింది. రాజు మృతిపై పౌర హక్కుల సంఘం నేత పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? అయితే ఆ వాదనలకు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ప్రతివాదనలు చేశారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేసింది. రాజు ఆత్మహత్యపై ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ, పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ చేసినట్లు ఏజీ నివేదిక ఇచ్చారు. ఆ వీడియోలను రేపు రాత్రి 8 గంటల్లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే పట్టాలపై గురువారం ఉదయం రాజు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ వర్గాలు మాత్రం రాజుది ఆత్మహత్య అని స్పష్టంగా చెబుతున్నారు. కానీ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర హక్కుల నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. చదవండి: నిర్మల్ సభలో ‘ఈటల’ స్పెషల్ అట్రాక్షన్: చప్పట్లు మోగించిన అమిత్ షా -
అత్యాచార నిందితుడికి శిక్ష ఖరారు
సాక్షి, వరంగల్ : ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడిన ఓ కామాంధుడికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును శుక్రవారం జిల్లా కోర్టు వెలువరించింది. జయశంకర్ జిల్లా గోరికొత్త పల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ శివ అనే నిందితుడుకి వరంగల్ జిల్లా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. -
ఆ మృగానికి సరైన శిక్షే పడింది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో ముద్దాయి ప్రవీణ్ కుమార్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చిన్నారి శ్రీహితపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్ అదనపు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటువంటి కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు. ఈ కేసులో చిన్నారి తరఫున వాదించిన న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. Death penalty verdict by court of law for the animal who molested a child in Warangal is a welcome judgement👏 We need more stringent laws and fast track courts to take these horrendous offenders off our streets My compliments to the advocates who fought hard👍#JusticePrevails — KTR (@KTRTRS) August 8, 2019 పోలీసులకు కృతజ్ఞతలు: శ్రీహిత తల్లిదండ్రులు తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించడంతో శ్రీహిత తల్లిదండ్రులు రచన, జగన్‌లు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్‌ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడికి మరణశిక్ష పడటానికి వరంగల్ పోలీసులు, కమిషనర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. 48 రోజుల్లో నిందితుడికి మరణ శిక్ష ఖరారు కావడంతో వరంగల్ పోలీసులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారని తెలిపారు. నేరాలకు పాల్పడే వారికి ఈ తీర్పు ఓ హెచ్చరికగా నిలవాలని వారు కోరుకున్నారు. -
వరంగల్ కోర్టు తీర్పును స్వాగతించిన నాయీలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు తీర్పును తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక స్వాగతించింది. నేరం జరిగిన 48రోజుల్లోనే కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించడం అభినందనీయమని ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం అన్నారు. అతి తక్కువ సమయంలోనే కేసును పరిష్కరించి, హంతకుడికి శిక్షపడేలా చేసిన పోలీసులు, న్యాయవ్యవస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీహిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు. హామీలు అమలు చేయాలి నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని మద్దికుంట లింగం గుర్తు చేశారు. సెలూన్లకు విద్యుత్, కళ్యాణకట్ట ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై సీఎం స్వయంగా హామీయిచ్చినా ఇంతవరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్లో కేటాయించిన రూ.250 కోట్లు ఇప్పటివరకు మంజూరు చేయలేదని తెలిపారు. తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
వరంగల్ శ్రీహిత హత్యకేసులో సంచలన తీర్పు
సాక్షి, వరంగల్: నగరంలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది నెలల పసికందుపై అమానుషంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన మానవమృగం ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జి జయకుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై జూన్ 18న నిందితుడు ప్రవీణ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నేరం జరిగిన 48రోజుల్లోనే కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించడం గమనార్హం. సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో అత్యంత కిరాతకంగా వ్యవహరించిన ప్రవీణ్ తరఫున ఎవరు వాదించరాదని వరంగల్ బార్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగింది..! మానవత్వమే కన్నీరు పెట్టింది. తాను మనిషిని అని మరిచిన ప్రవీణ్ అనే మృగం.. అభం శుభం తెలియని తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంగళవారం అర్ధరాత్రి (జూన్ 18న) ఈ ఘటన చోటుచేసుకుంది. హన్మకొండలోని కుమార్‌పల్లి జెండా ప్రాంతానికి చెందిన జంపాల యాదగిరి, నిర్మల దంపతులకు కుమారులు భరత్, నరసింహరాజుతో పాటు కుమార్తె రచన సంతానం. రచనను మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీప మాడుగుల గ్రామానికి చెందిన కమ్మోజీ జగన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల శ్రీహిత ఉంది. పాప ఆధార్ కార్డు నమోదు కోసం ఈ నెల 17న కూతురుని తీసుకుని హన్మకొండలోని తల్లిగారింటికి రచన భర్త జగన్‌తో వచ్చింది. మరుసటి రోజు ఆధార్ సెంటర్‌కు వెళ్లగా జనం అధికంగా ఉండటంతో మరుసటి రోజు రావాలని నిర్వాహకులు సూచించారు. అయితే జగన్‌కు ఆఫీసులో అత్యవసర పని ఉండటంతో భార్య, కుమార్తెను ఇక్కడే ఉంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అర్ధరాత్రి అపహరణ రాత్రి భోజనం చేశాక నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత రచనకు మెలకువ రాగా పక్కనే పాప శ్రీహిత లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్ బైక్‌పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ఓ వ్యక్తి భుజాన టవల్లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ఆ మానవ మృగం భరత్‌ను చూసి పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, దుండగుడిని పట్టుకున్న భరత్ చితకబాదాడు. చిన్నారిని చూసేసరికి ఎలాంటి కదలిక లేకపోవడం.. శరీరం నుంచి అధిక రక్తస్రావం కావడాన్ని గుర్తించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి శ్రీహితను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా ఏడ్చారు. పంచనామా చేసిన హన్మకొండ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం చేసి ఆపై హత్య శ్రీహిత మృతదేహానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యనిపుణుడు డాక్టర్ రజాం అలీఖాన్ వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నివేదికలో తేలిందని పేర్కొన్నారు. అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు తేలిందని తెలిపారు. ఈ ఘటనలో చిన్నారి తలపై రెండు ప్రదేశాల్లో గాయాలైనట్లు నిర్ధారించారు. -
వరంగల్ కోర్టులో బెంగాల్ యువకుడి రిమాండ్
వరంగల్ లీగల్ : బాలికను కిడ్నాప్ చేసి పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో నివసిస్తున్న పశ్చిమబెంగాల్ యువకుడిని ఇక్కడి పోలీసుల సాయం తో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లా గోల్‌బరీ గ్రామానికి చెందిన దేబశీష్‌రాయ్(19) మరో ఇద్దరు కలిసి 2016 జూలై 14న అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ను కిడ్నాప్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నాడియా జిల్లా కృష్ణానగర్ మహిళా పోలీస్స్టేన్లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బాలికతో సహ నిందితుడు దేబశీష్‌రాయ్ పరారీలో ఉన్నాడు. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో అతడు బాలికతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు బెంగాల్ పోలీసులకు సమాచారమందింది. దీంతో కల్లెడకు చేరుకొని పర్వతగిరి పోలీసుల సాయంతో శుక్రవారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కృష్ణానగర్ మహిళా పోలీస్‌స్టే ఏఎస్సై సుజాతసింగ్‌రాయ్ కోర్టుకు తెలిపారు. చట్టప్రకారం 24 గంటల్లో సంబంధిత నాడియా జిల్లా కృష్ణానగర్‌లోగల అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిసే్ట్రట్ సదార్ కోర్టులో హజరుపరచలేనందు వల్ల అందుబాటులోఉన్న మూడో ము న్సిఫ్ మెజిసే్ట్రట్ కోర్టులో హజరుపరుసున్నామని 4 రోజుల్లో సంబంధిత కోర్టులో హాజరుపర్చడానికి అనుమతి ఇవ్వాలని ఏఎస్సై కోరారు. రిమాండ్ స్వీకరించిన కోర్టు అనుమతి ఇస్తూ జడ్జి అజేష్‌కుమార్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేశారు. -
సీపీఐ రామకృష్ణకు వరంగల్ కోర్టు జైలు శిక్ష
వరంగల్ : ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా ఆరుగురికి వరంగల్ కోర్టు జైలు శిక్ష విధించింది. 2012లో రైతు గిట్టుబాటు ధర కోసం మార్కెట్లో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. కార్మికుల ఆందోళనతో ఆస్తినష్టం వాటిల్లిందని కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీ వలలో సీసీఎస్ సీఐ
బెయిల్ ఇంప్లూమెంట్కు డబ్బులు డిమాండ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు పథకం ప్రకారం సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను పట్టుకున్న వైనం పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : ఏసీబీ అధికారుల చేతి కి మరో అవినీతి చేప చిక్కింది. బెయిల్ ఇంప్లూమెం ట్(కొనసాగించేందుకు) కోసం డబ్బులు డిమాండ్ చేసినందుకు వరంగల్ అర్బన్ సీసీఎస్-2 సీఐ శివసాంబిరెడ్డితోపాటు హెడ్ కానిస్టేబుల్ ఐలయ్యను బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు పథకం ప్రకా రం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథ నం ప్రకారం.. డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ సస్పెండ్‌కు గురైన ఫక్రుద్దీన్ బధీ ర ఉపాధ్యాయుల అక్రమ నియామకం కేసులో నింది తుడు. 2012 డీఎస్సీలో నలుగురు బధీర ఉపాధ్యాయుల నియామకాల్లో ఫక్రుద్దీన్ హస్తం కూడా ఉంద ని వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు ఇటీవల అతడికి అరె స్ట్ వారెంట్‌ను జారీచేశారు. దీంతో ముందస్తు బెయిల్ ఫక్రుద్దీన్ వరంగల్ కోర్టులో ఇటీవల దరఖా స్తు చేసుకోగా న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో ఫక్రుద్దీన్ బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు హైకోర్టు అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ను ఇంప్లూమెంట్ చేయాలని ఫక్రుద్దీన్ ఇటీవల వరంగల్ అర్బన్ సీసీఎస్ సీఐ శివసాంబిరెడ్డిని కోరాడు. కాగా, బె యిల్ ఇంప్లూమెంట్ కోసం సీఐ.. ఫక్రుద్దీన్ నుంచి రూ. 50వేలు డిమాండ్ చేశారు. అయితే తన దగ్గర అంత డ బ్బు లేదని చెబుతూ.. తన సమీప బంధువు రిటైర్డ ఎస్సై మస్తాన్‌ను తీసుకెళ్లి సీఐ దగ్గర ప్రాధేయపడ్డాడు. దీంతో కనీసం తనకు రూ.27వేలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేయగా దానికి ఫక్రుద్దీన్ ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా మొత్తం నాలుగు కేసుల్లో సీఐ రెండింటికి బెయిల్ మంజూరు చేశాడు. అయితే మరో రెండింటికి డబ్బులిచ్చినాకానే ఇస్తానని సీఐ చెప్పాడు. కాగా, ఇదే విషయమై సీఐ.. ఫక్రుద్దీన్‌కు ప్రతి రోజు ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు తీసుకొస్తున్నావని వేధిస్తున్నాడు. దీంతో సీఐ వేధింపులను భరించలేని బాధితుడు ఫక్రుద్దీన్ తన సమీప బంధువు రిటైర్డ ఎస్సై మస్తాన్ సాయంతో ఇటీవల ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు మట్టెవాడలోని అర్బన్ సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డబ్బులు తీసుకొచ్చినట్లు రిటైర్డ ఎస్సై మస్తాన్.. సీఐ శివసాంబి రెడ్డికి సమాచారం అందించాడు. దీంతో సీఐ వెంటనే తన పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ అయిలయ్యను పిలిచి ఫక్రుద్దీన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకురా.. అని బయటకు పంపించాడు. కాగా, ఫక్రుద్దీన్, రిటైర్డ ఎస్సై మస్తాన్లు పోలీస్‌స్టేషన్ సమీపంలోని కారులో కూర్చుని కానిస్టేబుల్ అయిలయ్యకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అయిలయ్య దగ్గర ఉన్న రూ. 25వేల నగదును స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏసీబీ అధికారులు రిటైర్డ ఎస్సై మస్తాన్ దగ్గర ఉన్న వాయిస్ రికార్డింగ్ ను పరిశీలించి సీఐ శివసాంబిరెడ్డిని, ఐలయ్య అరెస్ట్ చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రఘువేందర్‌రావు, సాంబయ్య, బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి రెండు సార్లు సస్పెండ్..? ఇదిలా ఉండగా, ఏసీబీకి చిక్కిన సీసీఎస్ సీఐ శివసాంబిరెడ్డి ఇప్పటివరకు రెండుసార్లు విధుల నుంచి సస్పెండ్ అయినట్లు తెలిసింది. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో నల్లబెల్లం కేసులో, అలాగే నర్మెటలో భూమి కేసులో సస్పెండ్ అయినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. -
అమ్మా.. ఏ నేరం చేయలేదు: కేసీఆర్
న్యాయమూర్తికి విన్నవించిన కేసీఆర్ వరంగల్, న్యూస్‌లైన్: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వ్యాఖ్య లు చేయలేదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కోర్టుకు విన్నవించారు. 2012 మే 20న పరకాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఆత్మకూరు సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలతో కేసీఆర్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు విచారణ నిమిత్తం ఆయన సోమవారం ఉదయం కోర్టు హాలులో ప్రవేశిం చారు. మీపై ఉన్న అభియోగాలు ఒప్పుకుంటున్నారా..? అని న్యాయమూర్తి శ్రీదేవి ప్రశ్నించగా.. ‘అమ్మా.. అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎలాంటి నేరం చేయలేదు’ అని విన్నవించుకున్నారు. కాగా, న్యాయ మూర్తి తదుపరి విచారణ జూన్9కి వాయిదా వేశారు. -
వరంగల్ కోర్టుకు హాజరు కానున్న కేసీఆర్
వరంగల్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేడు వరంగల్ కోర్టుకు హాజరు కానున్నారు. పరకాల శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసు విచారణ నిమిత్తం ఆయన నేడు కోర్టుకు రానున్నారు. 2012 మే 20న ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివిధ వర్గాలు, కులాలు, మతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారనే అభియోగాలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కేసీఆర్ తరపున న్యాయవాది రవికుమార్ వాదించనున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 9 గంటలకు మడికొండకు చేరుకోనున్నారు. అనంతరం హన్మకొండలోని పార్టీ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుని తర్వాత కోర్టుకు హాజరవుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం హైదరాబాద్ తిరిగి వెళతారు.