దేవికారాణి, నాగలక్ష్మిల విలాస జీవితాలు! | Srinivas Reddy Arrested by ACB officers For IMS Scam | Sakshi
Sakshi News home page

జల్సా రాణి..!

Published Sat, Nov 2 2019 4:05 AM | Last Updated on Sat, Nov 2 2019 10:05 AM

Srinivas Reddy Arrested by ACB officers For IMS Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మాజీ డైరెక్టర్‌ దేవికారాణికి సంబంధించి ప్రతిరోజూ కొత్త లీలలు వెలుగుచూస్తున్నాయి. అక్రమంగా దోచుకున్న డబ్బుతో ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించారు. ఆమె అక్రమాస్తులు, చేసిన విలాసాలు, వాటికి వెచ్చించిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న విషయాలపై ఏసీబీ ఇప్పటికే కూపీ లాగడం ప్రారంభించింది.

మందుల డబ్బును దోచుకునేందుకు అందుబాటులో ఉన్న అన్నిరకాల అడ్డదారులను ఆమె ఉపయోగించారు. ఇటీవల ఈ కేసులో తేజా ఫార్మా ఎండీ సోదరుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో దాడులు చేసిన ఏసీబీ శుక్రవారం అతన్ని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తన వద్ద పనిచేసే కొడాలి నాగలక్ష్మి సాధారణ ఫార్మాసిస్ట్‌ అయినప్పటికీ ఆమె కూడా కోట్ల రూపాయల అక్రమార్జన గడించడం విశేషం. వీరిద్దరి అరాచకాలను గతంలోనే ‘సాక్షి’బయటపెట్టిన విషయం తెలిసిందే.

చదవండి: రూ.3 కోట్లతో నగలు కొన్న దేవికారాణి

డొల్ల కంపెనీల దందా.. 

డైరెక్టర్‌గా ఉన్న కాలంలో దేవికారాణి అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెకు.. నాన్‌ రేటెడ్‌ కంపెనీ (ఎన్‌ఆర్సీ)ల నుంచి వచ్చే కమీషన్లు సరిపోలేదు. అందుకే తన అనుచరురాలు ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలసి 2 డొల్ల కంపెనీలు సృష్టించారు. ఇందులో మహీధర మెడికల్‌ అండ్‌ సర్జికల్స్‌ను నాగలక్ష్మి బంధువైన ఎం.మురళీకృష్ణ పేరుపై ఉంచగా, మురళీకృష్ణ భార్య ఎం.విజయలక్ష్మీ పేరిట జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్‌ను స్థాపించారు. వీటిని తేజా ఫార్మాస్యూటికల్స్‌ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి 2016లో రిజిస్టర్‌ చేయించారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది ఆమెకు సహకరించినట్లుగా ఏసీబీ గుర్తించింది.

విందులు.. విలాసాలు.. 
అక్రమమార్గంలో కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బును దేవికారాణి, నాగలక్ష్మి, రాజేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగీ కలలో కూడా ఊహించనంత డబ్బు రావడంతో జల్సా జీవితాలకు అలవాటు పడ్డారు. ఖరీదైన హోటళ్లలో బర్త్‌డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్‌లు అంటూ అందుబాటులో ఉన్న ప్రతీ విలాసాన్నీ అనుభవించారు. తేలిగ్గా వస్తున్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియక వీరు చాలా కొత్త పనులు ముందేసుకునేవారు.

ఆఫీసులో సందర్భాలను సృష్టించుకుని అందులో డ్యాన్సులు చేయడం, పార్టీలు జరుపుకునేవారు. ఆ పార్టీల్లో దేవికారాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు తహతహలాడేవారు. ప్రత్యేకంగా బ్యూటీషియన్లు,  డ్యాన్స్‌ మాస్టర్లను పెట్టుకుని  డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేవారు. స్వయంగా అన్ని వేడుకల్లో ఆమెనే నర్తించేవారు. అంతేకాదు ఆత్మరక్షణ కోసం నాన్‌చాక్‌ తిప్పడం కూడా నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మోసం చేసిందిలా..? 
►1. 2016–18లో మహీధర మెడికల్‌ అండ్‌ సర్జికల్స్‌ కంపెనీకి రూ.3,69,58,500 విలువైన పర్చేజ్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఈ మందులు రేట్‌ కాంట్రాక్ట్‌ కంపెనీ (ఆర్సీ)ల ద్వారా కొనుగోలు చేస్తే వాస్తవానికి కేవలం రూ.61,99,972 మాత్రమే ఖర్చయ్యేది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.3,07,58,528 నష్టం వాటిల్లింది.  

►2. జై సాయిరాం కంపెనీకి రూ.4 కోట్ల పర్చేజ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఇదే రేటెడ్‌ కంపెనీలో వీటి విలువ రూ.1.12 కోట్లు మాత్రమే. ఫలితంగా 2.88 కోట్లు నష్టం వాటిల్లింది. 

►3. రాజేశ్వర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వైష్ణవి ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.5.50 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. ఇవి రేట్‌ కాంట్రాక్ట్‌ ప్రకారం రూ.1.41 కోట్లు మాత్రమే. ఫలితంగా ప్రభుత్వానికి రూ.4.09 కోట్లు నష్టం వాటిల్లింది. 

►4. తేజా ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, అతడి సోదరుడు శ్రీనివాసరెడ్డిలకు మొత్తం 8 డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు వచ్చిన కాంట్రాక్టులన్నీ నిబంధనలకు విరుద్ధంగా దేవికారాణి కట్టబెట్టినవే కావడం గమనార్హం. 

►5. ఇలా వచ్చిన ఆదాయాన్ని పీఎంజే జ్యువెలరీస్‌కు మళ్లించారు. అయితే అక్కడ నుంచి కేవలం నగల కొనుగోలుకే పరిమితమయ్యారా? ఇంకేదైనా లావాదేవీలు జరిపారా? అన్న విషయంలో ఏసీబీ లెక్కలు తవ్వుతోంది. 

►6. మహీధర మెడికల్‌ అండ్‌ సర్జికల్, జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్, ఎస్‌ఎస్‌ అసోసియేట్స్, సాయి శ్రీనివాస తదితర కంపెనీలకు ప్రాసెసింగ్, ఇన్వాయిస్, కొటేషన్స్‌ చేసి దాని ద్వారా వచ్చిన సొమ్మును నేరుగా అప్పటి డైరెక్టర్‌ దేవికారాణికి లేదా ఆమె సూచించిన వ్యక్తులకు అందజేసేవారు.  

►7. మొత్తంగా ఇలా అక్రమమార్గాల్లో దాదాపు రూ.10.85 కోట్ల మేరకు దేవికారాణి ముఠా కాజేసినట్లు ఏసీబీ పరిశీలనలో వెల్లడైంది.  

►8. ప్రభుత్వ జీవో నం.51 ప్రకారం రేటెడ్‌ కంపెనీల ద్వారా మందులు కొనాలి. కానీ, నిబంధనలను తుంగలో తొక్కిన దేవికారాణి.. రేటెడ్‌ కంపెనీలను పక్కనబెట్టి, తన బినామీలు సమర్పించిన నాన్‌రేటెడ్‌ కంపెనీలకు ముందుగా బిల్లులు చెల్లించేది. అందుకు రేటెడ్‌ కంపెనీల పనితీరు బాగా లేదని నిందలు వేసి నాన్‌రేటెడ్‌ కంపెనీలకు వాస్తవ ధర కంటే 10 రెట్లు అధికంగా కట్టబెట్టేది. 

►9. ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించేందుకు అంతకుముందున్న నిబంధనలకు తిలోదకాలిచ్చి ఎస్‌డీడీయూ (స్పెషల్‌ డ్రగ్‌ డిస్పెన్సరీ యూనిట్‌) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి సనత్‌నగర్‌లో ఓ గోదాము ఏర్పాటు చేసింది. ఇక్కడ మందులు వచ్చినట్లు బిల్లులు సృష్టించి వాటిని తన అనుచరులతో డ్రా చేసుకునేది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement