
ఆత్మహత్యకు పాల్పడిన మాధవి
భార్య మృతిచెందడంతో అతను అన్నీతానై బిడ్డను పెంచాడు. చదువులో చురుగ్గా ఉండడంతో కాయకష్టం చేసి ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఏమి జరిగిందో కాని ఆ విద్యార్థిని కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుని బలవన్మరణం పొందింది. దీంతో తండ్రి ఆవేదన అంతాఇంతా కాదు. ఉన్నత చదువులు చదివి అండగా ఉంటుందనుకున్న కుమార్తె అర్ధంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు.
శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలం వేలవేడు పంచాయతీ మాధమాల గ్రామానికి చెందిన అక్కుపల్లి బలరామయ్య యాదవ్, భారతి దంపతుల కుమార్తె మాధవి(18). మాధవికి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి భారతి మృతి చెందింది. బలరామయ్య మళ్లీ నెల్లూరు జిల్లా వెందోడు గ్రామానికి చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. కుటుంబ కలహాలతో సుజాత బలరామయ్యకు దూరమైంది. అప్పటి నుంచి మాధవిని బలరామయ్య గారాబంగా పెంచుకున్నాడు. మాధవి 1 నుంచి 5వ తరగతి వరకు స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివింది. 10వ తరగతి వరకు ఏర్పేడు మండలం పల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్ శ్రీకాళహస్తిలోని రాయలసీమ జూనియర్ కళాశాలలో పూర్తి చేసింది.
కుమార్తె చదువుల్లో రాణిస్తుండడంతో బలరామయ్య ఉన్నత చదువులు చదివించడానికి ఆసక్తి చూపాడు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో ఆగస్టు 10వ తేదీన సివిల్ ఇంజినీరింగ్‌లో చేర్పించాడు. ఆమె అదే కళాశాలకు చెందిన హాస్టల్‌లోనే ఉంటూ చదువుకుంటోంది. ఏమి జరిగిందో కాని ఆమె ఇటీవల ఇంటికి వచ్చేసింది. మూడు రోజులు ఇంటి దగ్గరే ఉండి శనివారం తిరిగి కళాశాలకు వెళ్లింది. సోమవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీటెక్‌లో చేరిన ఏడు నెలలకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందనే వార్త వినగానే తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. ‘భార్య దూరమైతే కంటికి రెప్పలా కాపాడుకుంటినే.. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్లిపోయావా తల్లీ అంటూ ఆయన చేస్తున్న రోదన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.
సెల్‌ఫోన్ దొంగతనం ఆపాదించడంతో..
మాధవి ఉంటున్న హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ కనిపించకపోయింది. దీంతో తోటి విద్యార్థినులు మాధవిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై మాధవి తన తండ్రికి తెలియజేయడంతో ఆయన నాలుగు రోజుల క్రితం కళాశాలకు వచ్చి హెచ్‌వోడీతో మాట్లాడారు. దీన్ని మాధవి అవమానంగా భావించింది. ఆదివారం రాత్రి తోటి స్నేహితులతో కలిసి నిద్రపోయిన మాధవి సోమవారం శవమై కనపించడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కళాశాల యాజమాన్యం వసతి గృహంలోని విద్యార్థినులను ఇళ్లకు పంపించారు. విషయం తెలుసుకున్న గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు, చిల్లకూరు, మనుబోలు ఎస్‌ఐలు శ్రీనివాసరావు, జేపీ శ్రీనివాసరావు కళాశాలకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. బాత్‌రూం తలుపును పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. పోస్టుమార్టం మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment