సాక్షి, తిరువొత్తియూరు: విద్యుత్ రైలులో పట్టా కత్తులతో ఘర్షణకు దిగిన ముగ్గురు కళాశాల విద్యార్థులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై మూర్‌మార్కెట్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం మధ్యాహ్నం గుమ్మడిపూండికి విద్యుత్ రైలు బయలుదేరింది. ఆ సమయంలో ఇంజిన్ నుంచి 3వ పెట్టెలో ఉన్న కొందరు యువకులు గొడవపడ్డారు. అక్కడే ఉన్న రైల్వే భద్రతా పోలీసు గమనించాడు. అతను రైలు ఎక్కే లోపే కదలి వెళ్లింది. పోలీసు కంట్రోల్ రూంకు దీనిపై సమాచారం అందించాడు.
దీంతో మూర్‌మార్కెట్ సీఐ అళగర్‌స్వామి, బేసిన్‌బ్రిడ్జ్ రైల్వే స్టేషన్లో డ్యూటీలో ఉన్న రైల్వే భద్రతా దళ పోలీసులకు సమాచారం అందించారు. రైలు అక్కడికి చేరుకోగానే అక్కడే ఉన్న పోలీసులను చూసిన ఆ యువకులు తమ వద్ద ఉన్న ఓ బ్యాగ్‌ను కింద పడవేశారు. పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అంతలోనే మరో యువకుడు తప్పించుకున్నాడు. బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా అందులో నాలుగు పట్టా కత్తులు లభించాయి.
అందులో టపాకాయలు, అగ్గిపెట్టెలున్నాయి. అనంతరం వారి గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు పచ్చయప్ప కళాశాలలో చదువుతున్న కవియరసు(19), మరుదు పాండియన్(19), సోమసుందరం (19) అని తెలిసింది. పట్టుబడిన విద్యార్థులు పారిపోయిన విద్యార్థులు గుమ్మడిపూండి, అత్తిపట్టు, తిరువొత్తియూరు ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment