పెళ్లి రోజే ఎస్‌ఐ మృత్యు ఒడిలోకి.. | Sub Inspector Died In Road Accident Nalgonda | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజే ఎస్‌ఐ మృత్యు ఒడిలోకి..

Published Wed, Mar 6 2019 8:06 AM | Last Updated on Wed, Mar 6 2019 9:07 AM

Sub Inspector  Died In Road Accident Nalgonda - Sakshi

ఎస్‌ఐ మధుసూదన్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య జ్యోతి, నివాళులర్పిస్తున్న డీసీపీ రాంచంద్రారెడ్డి, ఎస్పీ రంగనాథ్‌

నల్లగొండ క్రైం : పెళ్లిరోజే చివరి రోజు అయ్యింది. మంగళవారం తాను నడుపుతున్న వాహనం అదుపుతప్పి మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు భూదాన్‌పోచంపల్లి ఎస్‌ఐ కోన మధుసూదన్‌(33). నల్లగొండలో నిర్వహిస్తున్న పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల విధులు నిర్వహించేందుకు భూదాన్‌పోచంపల్లి నుంచి స్వయంగా పోలీస్‌ సుమో వాహనం నడుపుతూ ఇంటి నుంచి ఉదయం 4.30 గంటలకు బయలుదేరాడు. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదకరమైన కల్వర్టు రోడ్డుకు సమాంతరంగా ఉండడంతో పోలీస్‌ వాహనం రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి కంప చెట్లలోకి పల్టీకొట్టింది.  వెంటనే బెటాలియన్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్‌ను రప్పించేలోపే అటు వైపుగా వెళ్తున్న 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి 5.30 గంటలకు తరలించారు. గంటకు పైగా కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్‌ఐ మధుసూదన్‌ మృతి చెందాడు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు.

వారం రోజులుగా జ్వరంతో ఇబ్బంది...
ఎస్‌ఐ మధుసూదన్, భార్య జ్యోతి, కుమారుడు దుర్గాదీక్షిత్, కుమార్తె శ్రీవైష్ణవిలు వారం రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రాచకొండ ఉత్సవాల్లో కూడా విధులు నిర్వహించారు. సెలవు కావాలని ఉన్నతాధికారులను కోరడంతో రెండు రోజులు సెలవు ఇచ్చిన అధికారులు రాత్రి సెలవు రద్దు చేస్తున్నామని ఈవెంట్స్‌ విధులకు వెళ్లాలని ఆదేశించడంతో డ్రైవర్‌ లేకుండానే విధులకు సిద్ధమయ్యాడు. తన కుమార్తె అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి వెళ్తున్నట్లు డ్రైవర్‌ చెప్పడంతో మధుసూదన్‌ అతడికి సెలవు ఇచ్చాడు. స్వయంగా వాహనం నడపడం, అనారోగ్యం, విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సెలవు ఇచ్చినట్టే ఇచ్చి గంటల వ్యవధిలోనే రద్దు చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేమ వివాహం చేసుకున్న ఎస్‌ఐ
తిప్పర్తి మండలం తానేదారిపల్లి గ్రామానికి చెందిన కోన కొండయ్య, అంజమ్మ రెండో కుమారుడు మధుసూదన్‌. కలెక్టర్‌ విజయానంద్‌ బాధ్యతలు నిర్వహించిన సమయంలో తన బంగళాలో మధు చిరు ఉద్యోగిగా పనిచేశాడు. నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామానికి చెందిన జంజిరాల జ్యోతి కలెక్టరేట్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేయడంతో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయంతో 2011 మార్చి 05న ప్రేమ వివాహం చేసుకున్నారు. 2012 ఎస్‌ఐగా ఉద్యోగం సాధించాడు. భార్య జ్యోతి ఎంటెక్‌ పూర్తి చేసింది. మధు సోదరుడు నాగరాజు కరెంట్‌ మెకానిక్‌గా, మరో సోదరుడు రమేష్‌ మెడికల్‌ రిప్రజెంటేటీవ్‌గా పని చేస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి తల్లిదండ్రులకు అండగా ఉన్నాడు. సౌమ్యుడిగా మంచి పేరున్న మధు పెళ్లి రోజే మృతి చెందడంతో గ్రామస్తులంతా బోరున విలపించారు. ఎవరికి ఏ ఆపద ఉన్న ఆదుకునే వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు.

కుటుంబానికి అండగా ఉంటాం : సీపీ మహేష్‌ భగవత్‌ 
మధుసూదన్‌ కుటుంబానికి పోలీస్‌శాఖ పరంగా అండగా ఉంటామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. విధి నిర్వహణలో మంచి ఎస్‌ఐని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతంగా విధులు నిర్వహించి పోలీస్‌ శాఖలో మంచి గుర్తింపు పొందాడన్నారు. డ్రైవర్‌ ఉన్నప్పటికీ వాహనం స్వయంగా నడుపుకుంటూ రావడం అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రాథమిక సమాచారమన్నారు. సెలవులు అడిగిన విషయమై తమకు సమాచారం లేదన్నారు. సెలవు ఇచ్చి రద్దు చేశారని కుటుంబసభ్యుల ప్రస్తావనను సీపీ దృష్టికి తీసుకెళ్లగా విచారిస్తామన్నారు. వాహనం బోల్తా పడినప్పడు స్టీరింగ్‌ గుండెకు బలంగా తగిలిందని, చికిత్స పొందుతూ మృతిచెందినట్టు తెలిపారు. భార్య జ్యోతి ఎంటెక్‌ పూర్తి చేసిందని ప్రభుత్వ ఉద్యోగం, ఇతర అలవెన్స్‌లు అందిస్తామన్నారు.

నివాళులర్పించిన సీపీ, ఎస్పీ
పోస్టుమార్టం వద్ద మధు మృతదేహంపై సీపీ మహేష్‌భగవత్, డీసీపీ రామచంద్రారెడ్డి, జిల్లా ఎస్పీ రంగనాథ్‌లు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మధు కుమారుడిని ఎత్తుకొని సీపీ తండ్రి మృతదేహన్ని చూపించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దహన సంస్కారాల నిమిత్తం సీపీ, పోలీస్‌ సంక్షేమ సంఘం ఆర్థిక సాయాన్ని అందజేసింది. 

నివాళులర్పించిన పలువురుప్రముఖులు..
తిప్పర్తి(నల్లగొండ) :  
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మధుసూదన్‌ మృతదేహనికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన స్వగ్రామం తిప్పర్తి మండలం తానేదార్‌పల్లి గ్రామంలో నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చారు. యాదాద్రి డీసీపీ రాంచంద్రారెడ్డి, చౌటుప్పల్‌ ఏసీపీ బాపురెడ్డి, డీఎస్పీ గంగారాం, 10 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు  అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు.

ప్రజాప్రతినిధులు..
మధుసూదన్‌ కుటుంబాన్ని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, పలు గ్రామాల సర్పంచ్‌లు పరామర్శించి, మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వాస్తుదోషం ఉందా..?
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌కు మొదటి నుంచి వాస్తు దోషం వెంటాడుతోందని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇద్దరు పోలీసులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దీంతో గతంలో పనిచేసిన ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి స్టేషన్‌ పడమర వైపు ప్రధాన ద్వారం మూయించి, ఉత్తరం వైపు చేశారు. ఆ తరువాత వచ్చిన ఎస్‌ఐలు మరికొన్ని మార్పులు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల స్టేషన్‌లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు వివిధ కారణాల వల్ల భువనగిరి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ అయ్యారు. సోమవారం హెడ్‌కానిస్టేబుల్‌ శంకర్‌నాయక్‌ కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. వాస్తు దోషం ఉందని భావించిన ఎస్‌ఐ మధుసూదన్‌ 15 రోజుల క్రితమే స్టేషన్‌ సమీపంలో ఉప్పలమ్మ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

రోదిస్తున్న కుమారుడు, కుమార్తె

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement