సాక్షి, ముంబై: దేశ ఆర్థిక నగరమైన ముంబైలో ఆత్మహత్మ కేసులు పెరిగినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 17,195 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో ఒక్క ముంబైలోనే 1,205 మంది ఉన్నట్లు రాష్ట్ర నేర అన్వేషణ విభాగంలో నమోదైన గుణంకాలను బట్టి తెలిసింది. రాష్ట్రంలోని వివిధ నగరాలతో పోలిస్తే ముంబైలోనే అధికంగా అత్మహత్య కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో జరిగిన మొత్తం 17,195 ఆత్మహత్యల్లో 12,877 పురుషులుండగా 4,315 మహిళలు, ముగ్గురు హిజ్రాలున్నారు. అదేవిధంగా ముంబైలో చేసుకున్న మొత్తం 1,205 ఆత్మహత్యల్లో 808 పురుషులుండగా 396 మహిళలు, ఒక హిజ్రా ఉన్నారు. కాగా ఆత్మహత్య చేసుకున్న వారిలో ముఖ్యంగా జీవితంపై విరక్తి, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టం, దీర్గకాలిక వ్యాధితో బాధపడడం తదితర కారణాలున్నాయి. నగరంతో పోలిస్తే ఉప నగరాలలోనే ఆత్మహత్య కేసులు ఎక్కువ నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. మలాడ్, గోరేగావ్, శివాజీనగర్, గోవండీ, బోరివలి, విక్రోలి తదితరా ఉప నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్న వారిలో పిల్లలు కూడా ఉండడం గమనార్హం. ముంబై తరువాత పుణేలో ఏకంగా 945 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment