
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన ఓ మహిళ సౌదీ అరేబియాలో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. 2015 ఆగస్టు నెలలో పొట్టకూటికోసం సౌదీ వెళ్లిన కేశనకుర్తి పద్మావతి(47) ఈనెల 4న ఆత్మహత్య చేసుకుందని అక్కడి తెలుగువారు రెండ్రోజుల క్రితం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. పద్మావతి సమాచారం తెలుసుకోవడానికి ఆమె కుటుంబసభ్యులు గురువారం ఏలూరు కలెక్టరేట్‌కు వచ్చారు. సౌదీ నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని ఆరా తీశారు.
తమకు సమాచారం లేదని కలెక్టరేట్ వర్గాలు చెప్పడంతో.. పద్మావతి మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేలా కృషి చేయాలని కోరుతూ డీఆర్‌వోకు వినతిపత్రం సమర్పించారు. ఆమె యజమాని నుంచిగానీ, సౌదీ నుంచిగానీ భారత ఎంబసీకి సమాచారం అందలేదని తెలుస్తోంది. ఈనెల 4 తర్వాత ఫోన్‌లో పద్మావతి అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా పోయింది. రెండేళ్ల వర్క్ అగ్రిమెంట్ ముగియడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో పద్మావతి తిరిగి రావాల్సి ఉంది. గత నెలలో ఫోన్ చేసి డిసెంబర్ 4న ఇంటికి వస్తున్నట్టు కూడా తెలిపింది. ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియడం లేదని, యజమాని కుటుంబ సభ్యులే పద్మావతిని చంపి ఆత్మహత్యగా చెబుతూ ఉండవచ్చని మృతురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment