అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం
గన్నేరువరం(మానకొండూర్) : వరకట్న వేదింపులకు బలైన మండలంలోని గుండ్లపల్లికి చెందిన కట్కూరి స్వప్న అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. భార్య చనిపోయిన చూసేందుకు భర్త రాకపోవడంతో మృతురాలి తండ్రి, కూతురే చితికి నిప్పుపెట్టారు.
స్వప్న మృతికి కారకులైన వారిని శిక్షించే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే, గ్రామస్తుల హామీతో మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంత్యక్రియలతో సద్దుమణిగాయి.
ఈనెల 31న మృతి
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన కట్కూరి స్వప్న ఈనెల 31న ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త శ్రీపాల్‌రెడ్డి, అత్తామామ అరుణ–అంజిరెడ్డి వేదింపులతోనే ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి కుటుంబసభ్యులు అత్తవారింటి ఎదుట ఆందోళనకు దిగారు.
నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు ఆస్తిని మృతురాలు కూతుళ్లు విస్మయ, విన్నత్న పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అంగీకరించిన అత్తారింటి వారు అనంతరం పరారవడంతో ఆందోళన ఉధృతం చేశారు.
గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై రాస్తారోకో సైతం చేశారు. ఇలా ఐదు రోజులుగా హైడ్రామాల మధ్య స్వప్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. మృతురాలి కుటుంబానికి గ్రామస్తులు, వివిధ పార్టీలు, సంఘాల నుంచి మద్దతు పెరిగింది.
ఎమ్మెల్యే, గ్రామస్తుల హామీతో..
నాలుగో రోజు ఆదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. పిల్లలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, దహనసంస్కారాలు నిర్వహించాలని సూచించారు.
ఐదోరోజు సోమవారం గ్రామస్తులు కలిసి దహనసంస్కారాలు నిర్వహించాలని సర్పంచ్ చాడ కృష్ణామోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కోరారు. ఎలాంటి పరిస్థితుల్లోనైన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటామని ఒప్పంద హామీ ఇచ్చారు. దీంతో స్వప్న అంత్యక్రియలకు కుటుంబసభ్యులు అంగీకరించారు.
నిప్పుపెట్టిన తండ్రి, కూతురు
ఐదు రోజులు శవంతో ఆందోళన చేసిన కుటుంబసభ్యులు అశ్రునయనాల మధ్య స్వప్న మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించారు. భార్య మృతి చెందిన కనికరం లేకుండా భర్త పరారీలో ఉండడంతో మృతురాలు తండ్రి వెంకటప్రకాశ్, పెద్ద కూతురు విస్మయతో కలిసి నిప్పుపెట్టారు. స్వప్న చితికి నిప్పుపెడుతున్న తండ్రి, కూతురు
పోలీసుల వైఫల్యమే : డాక్టర్ నగేశ్
పోలీసుల వైఫల్యంతోనే నిందితులు తప్పించుకున్నారని, వారిని వెంటనే అరెస్ట్ చేసి మృతురాలు కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ డిమాండ్ చేశారు. గుండ్లపల్లిలో భర్త ఇంటి వద్ద శవంతో ధర్నా చేస్తున్న స్వప్న కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు.
ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సమంజసంకాదన్నారు. న్యాయం దక్కే వరకు అండగా ఉంటామని మృతురాలి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్‌వర్మ, జిల్లా కార్యదర్శి డీటీ సుధాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాచమల్ల నర్సయ్య, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకటి అనిల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment