నిందితుడు దుర్గాప్రసాద్
హైదరాబాద్: తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న అక్కసుతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌కు చెందిన యువతి (18)కి ఆమె అద్దెకుంటున్న ఇంటి కింది పోర్షన్‌లో ఉంటున్న యన్నాబత్తుల దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అతడు అక్కడి టైలర్‌షాపులో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతను ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె నిరాకరించింది. ఇదిలా ఉండగా సదరు యువతికి ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది.
ఈ విషయం తెలియడంతో ఆగ్రహానికి లోనైన దుర్గాప్రసాద్ సోమవారం ఆమె ఇంటికి వెళ్లి తనను ప్రేమిస్తావా? లేదా? అంటూ నిలదీశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను కాకుండా ఇంకెవరిని చేసుకున్నా చంపేస్తానంటూ తనతో పాటు తెచ్చుకున్న కత్తెరతో మెడపై పొడిచాడు. బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకొని కిందకి పరుగు తీసింది. దీనిని గుర్తించిన టైలర్‌షాపు యజమాని యూసుఫ్ ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాడు. స్థానికులు దుర్గాప్రసాద్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment