చెన్నై : తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా ఓ యువతి కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సదరు యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విచారకర ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు... అనురాధ రాజేశ్వరి(30) అనే ఓ ప్రముఖ సంస్థలో బిజినెస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం విధుల నిమిత్తం స్కూటర్‌పై ఆఫీసుకు బయల్దేరింది. కాగా కోయంబత్తూరు హైవే మీదకు వెళ్లగానే అన్నాడీఎంకే పార్టీ జెండా కట్టేందుకు ఉపయోగించిన స్తంభం మీద పడటం గమనించిన రాజేశ్వరి దానిని తప్పించబోయి కిందపడిపోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఆమె కాళ్లపై నుంచి దూసుకుపోయింది. దీంతో రాజేశ్వరి రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. ప్రస్తుతం ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాగా ఈ ఘటనపై రాజేశ్వరి బంధువులు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజేశ్వరి అమ్మానాన్నాలకు తను ఒక్కగానొక్క కూతురు అని... ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుందని తెలిపారు. తనకు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి పళనిసామికి స్వాగతం పలికేందుకు అవినాశి హైవేపై పెట్టిన జెండా స్తంభం కారణంగానే ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా లారీ డ్రైవర్ అధిక వేగంతో దూసుకురావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా గతంలో ఇదే తరహాలో శుభశ్రీ అనే టెకీ ప్రమాదం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలపాలై మరణించడంతో అన్నాడీఎంకేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాసు హైకోర్టు బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు శుభశ్రీ కేసులో నిందితుడిగా ఉన్న అన్నాడీఎంకే నాయకుడు జయగోపాల్‌కు సోమవారమే బెయిలు మంజూరుకావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment