అరెస్టయిన బీటీవీ రామారావు
సాక్షి, విశాఖపట్నం/భీమునిపట్నం: ట్యాంపరింగ్‌కు పాల్పడిన మాజీ తహసీల్దార్ బీటీవీ రామారావు మరోసారి కటకటాలపాలయ్యారు. అడ్డగోలుగా రికార్డులను ట్యాంపర్ చేసి వందల వేల కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతమయ్యేందుకు కారణమైన ఈయన రాజకీయ పలుకుబడితో తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకోవడమే కాదు.. ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి విశాఖలోనే వరుసగా మూడు సార్లు పోస్టింగ్ పొందారు. అయితే ‘మా కొద్దీ అధికారి’అంటూ జిల్లా అధికారులు తిప్పి పంపగా ఎన్నికల వంకతో శ్రీకాకుళంలో పోస్టింగ్ పొందారు. నేడో రేపో బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో మరో కేసులో మరోసారి జైలు పాలయ్యారు.
భీమిలి తహసీల్దారుగా పనిచేసిన సమయంలో రికార్డుల ట్యాంపరింగ్‌లతో పాటు పలు అవకత వకలకు పాల్పడగా అరెస్టయిన సంగతి తెలిందే. కాగా తాజాగా మరో కేసులో ఆయన మళ్లీ అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. విశాఖలో ఉంటున్న రామారావును భీమిలి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసు వివరాలను భీమిలి సీఐ ఎం.వెంకటనారాయణ శుక్రవారం రాత్రి మీడియాకు తెలియజేశారు.
విశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న బడే నరసింహారావు 2007లో చేపలుప్పాడులోని సర్వే నంబర్ 31/7లో 30 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అడంగల్, వన్–బీ, పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పొందారు. 2016 వరకు రెవెన్యూ రికార్డులన్నింటిలోనూ ఈ భూమి ఆయన పేరు మీదే ఉండేది. 2016 జనవరి 12న కారి సత్తెన్న పేరిట మారిపోయింది. సత్తెన్న చనిపోయాడంటూ కొద్ది రోజులకు వారి కుమారులు కారి అప్పారావు, ఆనంద్‌ల పేరిట అడంగల్, 1బీలు మార్చారు.
వాటిని భీమిలి కోర్టులో సమర్పించి మేజిస్ట్రేట్‌ను కూడా తప్పుదారి పట్టించి 2017 డిసెంబర్‌లో తమకు అనుకూలంగా ఆర్డర్స్ పొందారు. ఆ వెంటనే ఆ భూమిలో భారీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు విద్యుత్ కనెక్షన్ తీసుకుని, వారి పేరిట ఇంటి పన్నులు కూడా చెల్లించారు. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని నరసింహారావు స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యల్లేవు. చివరకు అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆశ్రయించగా ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విచారణలో బీటీవీ రామారావు తహసీల్దార్‌గా ఉన్న సమ యంలో రికార్డులు ట్యాంపర్ చేసి పేర్లు మార్చేసినట్టుగా నిర్ధారించారు.ఆ మేరకు కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. దాన్ని ఆధారంగా చేసుకుని బీటీవీ రామారావుపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు.
గ్రీవెన్స్‌లో వినతితో కదలిక
2018 డిసెంబర్ 27న ఈ స్థలానికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఇక్కడ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఉద్దేశ పూర్వకంగా రికార్డులు మార్చిన బీటీవీ రామారావుతో పాటు తన భూమిలోకి చొరబడిన కారి అప్పారావు, ఆనంద్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలేదంటూ ఈ నెల 21న గ్రీవెన్స్‌లో కలెక్టర్ కాటంనేని భాస్కర్ దృష్టికి నరసింహారావు తీసుకెళ్లారు. పది రోజుల్లో ఫ్రెష్ అడంగల్, వన్‌బీ ఇచ్చి, ఈ మేరకు తనకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అంతే కాకుండా రికార్డులను ట్యాంపర్ చేసిన రెవెన్యూ అధికారులు, కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. కాగా క్రైం నంబర్ 339/2018 కింద నమోదైన ఈ కేసులో బీటీవీ రామారావు చేసిన తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు రామారావుతో పాటు కారి అప్పారావు, కారి ఆనంద్ తదితరులపై సెక్షన్‌లు 465, 468, 4 71 కింద కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు శు క్రవారం ఉదయం విశాఖలోని అక్కయ్యపాలెం నందగిరినగర్‌లో ఉంటున్న రామారావు నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. భీమిలి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్టుగా సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment