పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ తప్పుడు ప్రచారం  | TDP campaign with paid artists | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని పలుచన చేసే కుట్ర!

Published Mon, Aug 26 2019 4:56 AM | Last Updated on Mon, Aug 26 2019 12:18 PM

TDP campaign with paid artists - Sakshi

పోలీసుల అదుపులో టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ శేఖర్‌ చౌదరి

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై తెలుగుదేశం పార్టీ పెయిడ్‌ ఆర్టిస్టులు అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తప్పుడు ప్రచారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను ప్రజల్లో పలుచన చేయడమే కుట్రదారుల ఉద్దేశమని భావిస్తున్నారు. ఒకవైపు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలై ఉంటే మరోవైపు టీడీపీ పనిగట్టుకుని బురద రాజకీయం చేయడానికి పెయిడ్‌ ఆర్టిస్టులను వాడుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ప్రచారం కోసం వినియోగించిన జూనియర్‌ ఆర్టిస్టులను, పెయిడ్‌ ఆర్టిస్టులను రంగంలోకి దించి రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం సాగించారు.

టీడీపీ పెద్దల డైరెక్షన్‌లో రెచి్చపోయిన పెయిడ్‌ ఆర్టిస్టులు ఏకంగా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కులం పేరుతో దూషించారు. కుల వృత్తిని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులం అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సదరు వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టుల తీరుపై యాదవ సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తొలుత విజయవాడ సత్యనారాయణపురం, కృష్ణా జిల్లా తిరువూరు, ఎ.కొండూరు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గుంటూరు, ఉభయ గోదావరి, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో ఫిర్యాదుల పరంపర కొనసాగింది. ఒక కులాన్ని, వృత్తిని కించపరచడంతోపాటు వ్యక్తిగత దూషణలు చేస్తూ పెట్టిన సోషల్‌ మీడియా పోస్టింగ్‌లపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. దీని వెనుక ఎవరున్నారన్న దానిపై తీగ లాగుతున్నారు.  

గుట్టు బయటపెట్టిన శేఖర్‌ చౌదరి  
టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టు కుడితిపూడి శేఖర్‌ చౌదరిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అతడు ఇచ్చిన సమాచారంతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివప్రసాద్, సీతారామయ్య, శివయ్య అనే మరో ముగ్గురు ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంపై పోలీసులు ఆరా తీయగా శేఖర్‌ చౌదరి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి తాను ఒక్కడినే కాదని, తమ లాంటి టీమ్‌లు చాలా పనిచేస్తున్నాయని గుట్టు విప్పినట్టు ప్రచారం సాగుతోంది. తమలాంటి వారికి నెలవారీగా వేతనాలు ఇచ్చి, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడానికి వాడుకుంటున్నారని వివరించినట్టు తెలిసింది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలతో ఆడియోలు, వీడియోలు రూపొందిస్తున్నామని శేఖర్‌ చౌదరి అంగీకరించాడు. 

టీడీపీ నేతలే నిర్మాతలు  
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేయడానికి టీడీపీ నేతలే డబ్బులు సమకూరుస్తున్నారని శేఖర్‌ చౌదరి వెల్లడించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి తెరవెనుక భారీ కుట్ర జరుగుతోందని పోలీసులు అంచనాకు వచ్చారు. దీని వెనుక ఎంతటి బడా బాబులున్నా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement