సీన్‌ రివర్స్‌ బెట్టింగులకు బెదురు | TDP Leaders Fear on Political bettings | Sakshi
Sakshi News home page

సీన్‌ రివర్స్‌ బెట్టింగులకు బెదురు

Published Wed, Apr 17 2019 12:21 PM | Last Updated on Wed, Apr 17 2019 12:21 PM

TDP Leaders Fear on Political bettings - Sakshi

పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్‌): గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ సీట్లను తెలుగుదేశం, అప్పట్లో దాని మిత్రపక్షం బీజేపీ తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే మొత్తం సీట్లను కట్టబెట్టిన జిల్లాకు చంద్రబాబు మొండి చేయి చూపడంతో జిల్లావాసుల్లో అంతర్మధనం ప్రారంభమైంది. దీని పర్యవసానమే ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఝలక్‌ ఇచ్చారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇద్దామనే ఆలోచన ప్రతిఒక్కరిలో తలెత్తింది. దీంతో జిల్లాలో సీన్‌ రివర్స్‌ అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎన్నికల ముందువరకూ రాష్ట్రంలో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని, ఈసారీ జిల్లాలో అత్యధిక సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటుందనే దానిపై బెట్టింగ్‌రాయుళ్లు, పచ్చ చొక్కాల నేతలు కోట్లలో పందాలు కాసేందుకు రెడీ అయ్యారు. అ యితే ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచి వీ రెవరూ నోరు మెదపడం లేదు. పైకి మాదే గెలుపు అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న టీడీపీ గణం లోలోన మాత్రం ఓటమి భయంతో కుంగిపోతున్నారు. దీంతో తమకు అత్యంత సన్నిహితులైన అనుచరగణం వద్ద ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టినా పందాల జోలికి వెళ్ల వద్దంటూ ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఈకారణంగానే వీరు బెట్టింగ్‌లకు దూరంగా ఉంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలో పోటాపోటీగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో  స్థానిక నాయకులు కొద్ది మొత్తాల్లో పందాలు కాస్తున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బెట్టింగ్‌ల జోరు చాలా తగ్గిందని పందెంరాయుళ్లు అభిప్రాయపడుతున్నారు.

పందేలకు దూరంగా..
2014 ఎన్నికల్లో సాక్షాత్తు ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ నేత ఒకరు స్వయంగా రూ.కోట్లలో పందెం కాసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయన ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్మంతా బెట్టింగ్‌ ద్వారా మొత్తం రాబట్టుకున్నారనేది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా ఉండేది. అదే నేత ఈ ఎన్నికల్లో అసలు గెలుస్తానో లేదో అనే అనుమానం రావడంతో తన అనుచరులను పందాలకు దూరంగా ఉండాలంటూ ముందస్తుగా హెచ్చరించారు. ఒకవేళ వేసినా కొద్ది మొత్తంలో కాసుకోండి తప్ప లక్షల్లో పందాలకు దూరంగా ఉండాలంటూ కోరినట్లు సమాచారం. బెట్టింగ్‌లు అంటే మూడో కాలిపై వెళ్లే సదరు నేత సైతం ప్రస్తుతం దాని ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఇదే నియోజకవర్గంలో ఎన్నికల ముందు వరకూ ప్రతి గ్రామంలోనూ పచ్చా చొక్కా నాయకులు, కార్యకర్తలు రూ.లక్షల్లో పందానికి రెడీ అంటూ మీసాలు మెలివేశారు. అవసరమైతే కోసు పందాలకు కూడా రెడీ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాజాగా వారంతా సైలెంట్‌ అయిపోయారు. పరోక్షంగా తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందో లేదో అనే అనుమానం వారిలో వ్యక్తం కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

తారుమారైన పరిస్థితి
రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కుతాయంటూ బీరాలు పలికిన టీడీపీ నేతలు ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. గ్రామాల్లో నలుగురు చేరే రచ్చబండలు, హోటళ్లు, కిళ్లీకొట్లు వంటి ప్రాంతాల్లో తారసపడినా తమ పార్టీ బొటాబొటీ మెజార్టీతో అయినా గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటివరకూ తామే అధికారంలోకి వస్తున్నామంటూ ప్రగల్భాలు పలికిన ఈ నాయకులు ఇప్పుడు ఇలా మాట్లాడటానికి వారిలో ఉన్న ఓటమి భయమే కారణమని తెలుస్తోంది.

వేచి చూచే ధోరణిలో..
జిల్లాలో పందెం రాయుళ్లకు కొదవ లేదు. అది క్రికెట్‌ మ్యాచ్‌ అయినా కోడి పందెం అయినా, చివరకూ రాజకీయ పోటీలైనా తెగబడి కోట్లలో పం దాలు కాయటం వీరికి పరిపాటి. జిల్లాలో ఇలా పందాలు కాసే వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఎన్నికల తర్వాత వీరంతా మౌనం వహించారు. ముందూ వెనుకా ఆలోచించకుండా పందాలు కాస్తే చేతులు కాల్చుకోవాల్సి వస్తుందనేది వీరి వాదనగా ఉంది.  ఇప్పటికే పందెం రాయుళ్లు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనసేన పార్టీల పరిస్థితులపై బేరీజు వేసుకున్నారు. జిల్లాలో మొత్తం స్థానాలను గతంలో మాదిరిగా ఒకే పార్టీకి కట్టబెట్టే పరిస్థితులు లేవనేది వీరి అభిప్రాయంగా ఉంది. దీంతో గెలుపోటములపై పందాలు కాసేందుకు గతంలో మాదిరిగా బెట్టింగ్‌ రాయుళ్లు ముందుకు రావడం లేదు. కేవలం గట్టి పోటీ ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో వీరు జనాల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్‌ దగ్గర పడే సమయానికి తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా బెట్టింగ్‌లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement