కరీంనగర్‌క్రైం: మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధించే పోకిరీలను షీటీమ్స్ కట్టడి చేస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి పక్కా ఆధారాలు సేకరించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నాయి. కరీంనగర్ కమిషనరేట్‌గా మారిన తర్వాత మహిళలపై వేధింపులకు చెక్ పెట్టేందుకు 2016 నవంబర్ 3న పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి షీటీమ్స్ ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లోని షీటీంలు ఈవ్‌టీజింగ్‌లను వీడియో రికార్డ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ పద్ధతిని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనూ అమలు చేస్తున్నారు. ఈవ్‌టీజింగ్‌ను అడ్డుకుని వారిని పట్టుకునేందుకు షీటీం సభ్యులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు.
మొదట ఈవ్‌టీజింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తారు. అనంతరం షీటీం సభ్యులను రంగంలోకి దింపుతారు. ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడుతున్న వారిని వీడియో కెమెరాలో రికార్డ్ చేసిన తర్వాత రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. పోలీస్‌స్టేషన్లకు తరలించి వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వెంటపడి వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై మహిళల ఫిర్యాదుల ద్వారా వలపన్ని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతీ కేసును కూడా ఒక కేసు స్టడీగా ఎక్కడా ఆరోపణలకు తావులేకుండా ఆకతాయిలను అగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో దాదాపు ప్రతీ కాలేజీ, బస్టాప్, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద షీ బృందాలు పని చేస్తున్నాయి. వీటికి కరీంనగర్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ పర్యవేక్షణలో మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌కుమార్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ వారం కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
వాట్సాప్‌కు పోలీస్ స్పందన..
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో వేములవాడకు వెళ్తున్న మహిళల పట్ల ముగ్గురు ఆటో డ్రైవర్లు వెంటపడి వేధింపులకు పాల్పడడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించారు. దీంతో సదరు మహిళ వెంటనే ఆటోను ఫొటో తీసి సీపీ కమలాసన్‌రెడ్డి, షీటీం ఇన్‌చార్జి సంతోష్‌కుమార్‌లకు పంపించింది. రంగంలోకి దిగిన షీటీం ఇన్‌చార్జి బృందం ఆటోడ్రైవర్లను పట్టుకుని కటకటాల్లోకి పంపారు. వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లపై మహిళలు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇబ్బందులు పడుతుంటే వాట్సాప్, హక్‌ఐ, ఫేస్‌బుక్ ద్వారా ఫిర్యాదు చేసినా షీటీంలు స్పందిస్తున్నాయి. షీటీం వాట్సప్ నంబర్ 9440795182.
అందుబాటులో ఉన్నాయి. కాలేజీల్లో విద్యార్థినులు, ఉద్యోగినులు, మహిళలు వేధింపులకు గురైతే ఆయా నంబర్లకు కాల్ చేసి చేప్పడం లేదా మెయిల్ చేసినా షీటీం స్పందించి చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదుదారుల వివరాలు బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసకుంటున్నారు. అమాయకులు బలి కాకుండా పగడ్బందీగా వీడియో రికార్డ్ చేసి పక్కాగా ఈవ్‌టీజర్లనే పట్టుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే కౌన్సెలింగ్, రెండోసారి పట్టుబడితే బైండోవర్, మూడో సారి పట్టుబడితే జైలుకు పంపిస్తున్నారు.
అవగాహన సదస్సులు..
షీటీంలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పనితీరుపై షీటీం ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కాలేజీల్లో, యువతులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ కాలేజీల్లో 89 అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతీ వారం ఏదో కాలేజీ, కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. షీటీంలు ఎలా పని చేస్తాయి, వేధింపుల సమయంలో ఎలా స్పందించాలో వివరిస్తున్నారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాలేజీ యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నారు.
పట్టుబడిన వారిలో..
షీటీంలు ఏర్పాటు చేసిన తర్వాత పట్టుబడిన వారిలో మైనర్లు, 50 ఏళ్ల దాటిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటున్నారు. మైనర్లకు కొందరు తల్లిదండ్రులు వేగవంతమైన బైకులు కొనివ్వడంతో వారు చదువులు మాని విద్యార్థినుల వెంటపడి వేధింపులకు దిగుతున్నారు. ఇంట్లో మృధుస్వభావిగా ఉంటూ బయటకు రాగానే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో షీటీం బృందాలు వారి ఆగడాలను వీడియో రికార్డ్ చేసి మరీ పట్టుకుంటున్నారు.
– 2016 నవంబర్ 3న ప్రారంభించిన షీటీంలు ఇప్పటి వరకు 1,607 మందిని పట్టుకున్నాయి. వారిలో మైనర్లు 139 మంది, 19 నుంచి 24 ఏళ్లలోపు వారు 530 మంది, 25 నుంచి 35 ఏళ్ల లోపు వారు 377 మంది, 36 నుంచి 50 ఏళ్లలోపు వారు 470 మంది, 50 ఏళ్లు అపైన 91 మందిని పట్టుకున్నారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోకిరీలపై 18 కేసులు నమోదు చేశారు. వీరిలో మొదటి తప్పుగా బావించి 1469 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 120 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. సుమారు 50 వేల పైగా విద్యార్థినులు, మహిళలకు హక్‌ఐ ఆప్లికేషన్ డౌన్‌లోడు చేయించారు.
విద్యార్థినులకు ఎంతో భరోసా
షీటీం ఏర్పాటు చేయడమనేది విద్యార్థినులకు ఎంతో భద్రత కలిగిస్తోంది. పోకిరీల వేధింపుల నుంచి రక్షణ పొందవచ్చు. విద్యార్థినులు వీటిపై మరింత అవగాహన పెంచుకోవాలి. వేధింపుల వల్ల నష్టపొతున్న విషయం కూడా ఈవ్‌టీజర్లకు తెలియాలి. స్వీయరక్షణ పద్ధతుల్లో కూడా విద్యార్థినులు, యువతులు శిక్షణ పొందాలి.– గాజుల దీప్తి, విద్యార్థిని
అవగాహన కలిగి ఉండాలి..
షీటీం పని విధానంపై అవగాహన కలిగి ఉండాలి. మహిళలకు ముఖ్యంగా విద్యార్థినుల భద్రత కోసం షీటీంలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల వివరాలు బయటకు చెప్పకుండా ఈవ్‌టీజర్లపై చర్య తీసుకోవడం మంచి పరిణామం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు నిత్యం వేధింపులు తప్పడం లేదు. ఈవ్‌టీజింగ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.– డి మాలతి, బీటెక్ విద్యార్థిని
మరింత బలోపేతం చేస్తాం..
సీపీ ఆదేశాల మేరకు షీటీంలను మరింత బలోపేతం చేస్తాం. ప్రస్తుతం 20 టీంలు పని చేస్తున్నాయి. త్వరలో మరిన్ని పెంచడంతోపాటు ఆధునిక గాడ్జెట్ అందిస్తాం. ఈవ్‌టీజర్లపై షీటీం సభ్యులకు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎలాంటి అనుమానాలు, అపోహాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఈవ్‌టీజర్లను పట్టుకుంటున్నారు. విద్యార్థినులు, మహిళలు అవగాహన కలిగి ఉండాలి. ఈవ్‌టీజింగ్ చేసినా, వేధించినా వెంటనే 9440795182కు సమాచారం అందించండి.– సంతోష్‌కుమార్, ఇన్‌స్పెక్టర్, మహిళా పోలీస్‌స్టేషన్, షీటీం ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment