
‘యువకుల్లారా ప్రేమ విషయంలో జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసి..
సాక్షి, విజయవాడ : నగరంలోని ఓ లాడ్జిలో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘యువకుల్లారా ప్రేమ విషయంలో జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని అఖిల్ లాడ్జీలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తెనాలికి చెందిన వంశీకృష్ణ అనే యువకుడు లాడ్జీలో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఒక యువతి వల్ల తన జీవితం నాశనమైందని వంశీకృష్ణ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. అమ్మ మిస్ యూ.. అంటూ లేఖలో అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
తన గురించి ఆలోచించవద్దని తల్లికి, సోదరికి సూచించాడు. ప్రియురాలి వల్ల తాను రూ. నాలుగు లక్షలు నష్టపోయానని, ఆమె వల్ల తాను జీవితాన్నే కోల్పోయానని వంశీకృష్ణ పేర్కొన్నాడు. గదిలో ఉన్న వంశీకృష్ణ ఎంతకూ తలుపుతీయకపోవడంతో లాడ్జీ సిబ్బంది అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా.. అప్పటికే వంశీకృష్ణ విగతజీవిగా కనిపించాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు లాడ్జీకి తరలివచ్చి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.