బాలుడి శవం దొరికిన అటవీ ప్రాంతంలో పోలీసుల పరిశీలన ఇన్‌సెట్‌లో విద్యార్థి శివకుమార్(ఫైల్)
ఆ బాలుడికి 15 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. పదో తరగతి విద్యార్థి దశలోనే దారుణ హత్యకు గురై ప్రాణాలు విడిచాడు. భూ వివాదం నుంచి బయటపడేందుకు ఓ మాంత్రికుని చేతిలో నరబలికి గురైనాడా ? లేక క్రికెట్ పోటీల గొడవలు అతడిని పొట్టనపెట్టుకున్నాయా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారణం ఏదైనా ఓ ఘోరం జరిగిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై : విళ్లుపురం జిల్లా ఉళుందూరుపేట సమీపంలోని అయన్కుంజరం గ్రామానికి చెందిన కేశవన్ (45) సౌదీ అరేబియాలో కూలీ పనులు చేస్తుంటాడు. కూలీ కార్మికురాలైన ఇతని భార్య పరాశక్తి (36) తమ సంతానమైన కుమారుడు శరత్‌కుమార్ (20), కుమార్తె సౌందర్య (18), మరో కుమారుడు శివకుమార్ (15)లతో గ్రామంలో నివసిస్తోంది. చిన్న కుమారుడు శివకుమార్ అక్కడికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. గొర్రెలు మేపేందుకు వెళ్లిన అవ్వ బాలాయీని వెతుక్కుంటూ ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లిన శివకుమార్ రాత్రి పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. బాలుడి తల్లి, అన్న శరత్‌కుమార్, బంధువులు అనేక చోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు.
బాలుడి ఇంటి ముందు గుమిగూడిన గ్రామస్తులు
ఇదిలా ఉండగా కుంజరం కారడవుల్లో ఒక బాలుడి శవం పడి ఉందని ఆదివారం రాత్రి సమాచారం రావడంతో అడవిలోకి గ్రామస్తులు బయలుదేరారు. సుమారు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత ఒక మారుమూలగుట్టలో గొంతు కోసి దారుణంగా హత్యకు గురైన స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్న శివకుమార్ శవాన్ని చూసి తల్లి, అన్న స్పృహతప్పి పడిపోయారు. వారితోపాటు వచ్చిన గ్రామస్తులు తల్లీ, కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉళుందూరుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విళుపురం ముండియంపాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడవుల్లోకి వెళ్లి గాలించగా ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుప్పటితో ముసుగువేసుకుని ధ్యానం చేస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు పోలీసులను చూడగానే పరుగులు పెట్టాడు. పోలీసులు అతడి వెంటపడి అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీ చేయగావిభూది, కుంకుమ, తాయత్తులు తదితర పూజాసామగ్రితోపాటు బ్లేడు సైతం దొరికింది. తాను ఒక భూమి వివాదాన్ని ఎదుర్కొంటున్నానని, అందుకే ఆడవుల్లో పూజలు చేస్తున్నానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ భూ వివాదం నుంచి బయటపడేందుకే బాలుడిని నరబలి ఇచ్చి ఉండవచ్చని పోలీసులు విశ్వసిస్తున్నారు. పోలీసులు ఆ వృద్ధుడిని అదుపులోకి తీసుకుని నరబలి కోణంలో విచారిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పాఠశాల స్థాయిలో క్రికెట్ పోటీలు జరుగగా ఇతర విద్యార్థులకు హతుడు శివకుమార్‌కు మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. క్రికెట్ పోటీలు, గొడవలు శివకుమార్ హత్యకు దారితీసాయా అనే అనుమానంతో ఏడుగురు విద్యార్థులను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment