సిటీకి ఉగ్రవాది సమీర్‌ | Terrorist Sameer In hyderabad | Sakshi
Sakshi News home page

సిటీకి ఉగ్రవాది సమీర్‌

Published Fri, Sep 7 2018 10:45 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

Terrorist Sameer In hyderabad - Sakshi

సమీర్‌

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన (ఎల్‌ఈటీ) ఉగ్రవాది షేక్‌ అబ్దుల్‌ నయీం అలియాస్‌ సమీర్‌ అలియాస్‌ నయ్యూను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు సిటీకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉన్న ఇతడిపై నాంపల్లి కోర్టు ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌ జారీ చేసింది. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడంలో దిట్టగా సమీర్‌కు పేరుంది.

సాక్షి, సిటీబ్యూరో: పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబాకు చెందిన (ఎల్‌ఈటీ) ఉగ్రవాది షేక్‌ అబ్దుల్‌ నయీం అలియాస్‌ సమీర్‌ అలియాస్‌ నయ్యూను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు సిటీకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌పై నాంపల్లి కోర్టు ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌ జారీ చేసింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడంలో దిట్టగా పేరున్న సమీర్‌ 2007లో ఉత్తర మండలంలోని మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆపై 2014లో కోల్‌కతా పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇతడిని తీసుకురావడానికి పటిష్టమైన ఎస్కార్ట్‌ను ఢిల్లీ పంపినట్లు  సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఇతడిని 2007 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌ సరిహద్దులు దాటుతుండగా బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెస్ట్‌ బెంగాల్‌లో పట్టుకున్నారు. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు సమీర్‌ మరో అయిదుగురితో కలిసి ఆపరేషన్‌ ‘మాద్రా’ కోసం వస్తున్నట్లు గుర్తించారు.

అదే ఏడాది మే 18న నగరంలోని మక్కా మసీదులో చోటు చేసుకున్న పేలుడు కేసులోనూ అనుమానితుడిగా మారాడు. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు విభాగం పీటీ వారెంట్‌పై 2007 జూన్‌ 6న ఇక్కడికి తీసుకువచ్చింది. విచారణ నేపథ్యంలోనే గతంలో కొన్నాళ్ల పాటు నగరంలో ఉన్న సమీర్‌ తన సహచరులు షోయబ్‌ జాగిర్దార్, ఇమ్రాన్, రఫీయుద్దీన్‌లతో కలిసి తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్‌ పొందడానికి ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో మరో కేసు నమోదు చేశారు. తదుపరి విచారణలో నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో సిట్‌లో మరో కేసు (ఎఫ్‌ఐఆర్‌ నెం.100/2007) నమోదు చేసిన పోలీసులు  కస్టడీలో ఉన్న సమీర్‌ను మహంకాళి ఠాణాలో ఉంచి విచారించారు.  ఈ నేపథ్యంలోనే అతను 2007 జూన్‌ 18న అదును చూసుకుని తప్పించుకుని, పారిపోవడానికి ప్రయత్నించిన ఇతగాడిని వెంటాడిన అధికారులు కాస్తా దూరంలోనే పట్టుకున్నారు. దీనిపై మహంకాళి ఠాణాలో కేసు నమోదైంది.

2013 జూన్‌లో ఈ ఎస్కేప్‌ కేసు, ఏప్రిల్‌లో పాస్‌పోర్ట్‌ కేసు కోర్టులో వీగిపోయాయి. సమీర్‌పై దేశ వ్యాప్తంగా అనేక కేసులు నమోదై ఉండటంతో అయా పోలీసులు పీటీ వారెంట్లపై తరలిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కోల్‌కతా పోలీసులు 2014 సెప్టెంబర్‌ 24న ముంబై కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తిరిగి హౌరా–ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతాకు తీసుకువెళ్తుండగా... ఖర్సియా–శక్తి రైల్వేస్టేషన్ల మ«ధ్య తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయ్యూను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు 2017 నవంబర్‌లో లక్నోలో పట్టుకున్నారు. ఆపై విచారణ నిమిత్తం సమీర్‌ను ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంచారు. నగరంలోని సిట్‌లో నమోదైన కేసులో ట్రయల్‌ నిర్వహించాల్సి ఉండటంతో అధికారులు నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్‌ తీసుకున్నారు. దీని ఆధారంగా సమీర్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ నుంచి గురువారం రాత్రి సిటీకి తరలించారు. శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. ఆపై తదుపరి విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement