
ఆభరణాలను చూపిస్తున్న డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ నిందితుడు సురేష్
బంజారాహిల్స్: ఉంగరం ఆధారంగా యజమాని కళ్లుగప్పి లక్షల విలువ చేసే ఆభరణాలు కాజేసిన పని మనిషిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.కోటి విలువైన 87 తులాల బంగారు వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా, కొమ్ములవంచ గ్రామానికి చెందిన సురేష్ బంజారాహిల్స్ రోడ్ నెం. 4లోఉంటున్న క్యాపిటల్ ఫార్చూన్స్ చైర్మన్ సాయిరామ్ మోచర్ల నివాసంలో గత నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. గత నెల 10న సురేష్ ఇంటి యజమానురాలు అపర్ణ బెడ్‌రూమ్‌లో నుంచి 43 తులాల బంగారు, వజ్రాభరణాలు, యజమాని తల్లి ఉమ గదిలో నుంచి మరో 44 తులాల బంగారు ఆభరణాలను తస్కరించాడు. వాటిని తన స్వగ్రామానికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించి యథావిధిగా పనిలో చేరాడు. అదే రోజే సాయిరాం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సురేష్‌తో పాటు మరో 20 మంది సిబ్బందిని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సాయిరాం తన నిశ్చితార్థం రోజున అత్తగారు తొడిగిన వజ్రపు ఉంగరం తనకు సెంటిమెంట్ అని ఆ ఒక్కటి దొరికినా బాగుంటుందని తెలిపాడు. సురేష్‌పైనే అనుమానం ఉన్న పోలీసులు కనీసం ఆ ఉంగరం దొరికితే కేసు మూసివేస్తామంటూ నమ్మబలికారు. గత నెల 16న సురేష్ తాను దొంగిలించిన ఉంగరాన్ని తీసుకొచ్చి అపర్ణ బెడ్‌రూమ్‌లో బెడ్‌షీట్లు మార్చే క్రమంలో దులుపుతుండగా ఉంగరం అందులోనుంచి కింద పడినట్లు నటించాడు. ఉంగరం దొరికిందని అపర్ణకు చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమశైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడి స్వగ్రామానికి వెళ్లి చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని ఆభరణాలను తన స్నేహితులు, బంధువులకు ఇచ్చి నట్లు తేలియడంతో వాటిని కూడా రికవరీ చేశారు. 19 ఆభరణాలు చోరీకి గురైనట్లు యజమాని ఫిర్యాదులో పేర్కొనగా దర్యాప్తులో 24 ఆభరణాలు దొరికాయి. తరచూ తాను బెడ్‌రూమ్ బీరువాలో నుంచి వీటిని తీసేవాడినని చాలా నగలు ఉండటంతో యజమానులు కనిపెట్టలేదని నిందితుడు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన డీఐ కె. రవికుమార్, డీఎస్‌ఐ నాగరాజు గౌడ్‌లను డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment