వాయు వేగం ముగ్గురు భావి విద్యార్థినులను బలితీసుకుంది. బెంగళూరు హుళిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఎంబీఏ విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు జార్ఖండ్, కేరళకు చెందిన వారుగా గుర్తించారు.
సాక్షి, బనశంకరి: ఉన్నత చదువుల కోసం సుదూర ప్రాంతాల నుంచి నగరానికి చేరిన విద్యార్థినులను మృత్యువు కబళించింది. అతివేగం వల్ల వారు ప్రయాణిస్తున్న వాహనమే మృత్యు శకటమై ముగ్గురు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ముగ్గురు తల్లులకు కడుపు కోత మిగిల్చిన ఈ ఘోర ఉదంతం హుళిమావు ట్రాపిక్‌పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు...జార్ఘండ్, కేరళలకు చెందిన శ్రీవాత్సవ్(23), హర్షితకుమార్(24), శృతి(24)లు ఎలక్ట్రానిక్‌సిటీ అలెయన్స్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నారు.
ఇదే కళాశాలలో చదువుతున్న పవిత్, ప్రవీణ్‌లతో కలిసి బన్నేరుఘట్టలో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు.వీరంతా శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో అద్దె కారు తీసుకొని కళాశాలకు బయల్దేరారు. ప్రవీణ్ కారు డ్రైవింగ్ చేస్తూ బన్నేరుఘట్ట రోడ్డు నైస్‌రోడ్డులో అతివేగంతో వాహనాన్ని కుడివైపు టర్న్ చేసి అదే వేగంతో ఎడమవైపునకు తిప్పాడు. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడి వంతెనను ఢీకొని ఆగిపోయింది. ప్రమాదంలో శ్రీవాత్సవ్, హర్షితాకుమార్ మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన శృతి, స్వల్పంగా గాయపడిన ప్రవీణ్, పవిత్‌లను విజయశ్రీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శృతి మృతి చెందింది. ప్రమాద తీవ్రతకు వాహనం నుజునుజ్జు కావడంతో శ్రీవాత్సవ్, హర్షితాకుమార్ మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. హుళిమావు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కట్టర్‌తో వాహనాన్ని కోసి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment