వేర్వేరుచోట్ల ముగ్గురి ఆత్మహత్య | Three Men Commits Suicide in Visakhapatnam | Sakshi
Sakshi News home page

వేర్వేరుచోట్ల ముగ్గురి ఆత్మహత్య

Published Thu, Feb 14 2019 7:53 AM | Last Updated on Thu, Feb 14 2019 7:53 AM

Three Men Commits Suicide in Visakhapatnam - Sakshi

కొర్రా మోహనరావు మృతదేహం

నూరేళ్ల జీవితాన్ని క్షణికావేశంతో చిదిమేసుకున్నారు. ఉపాధ్యాయులు మందలించారని ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థి, ప్రేమ విఫలమైందని పాతనగరంలో ఓ యువకుడు, వ్యక్తిగత కారణాలతో గాజువాకలో మరో యువకుడు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కన్నవారిని, కుటుంబ సభ్యులను విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు.

ముంచంగిపుట్టు(పెదబయలు):  ఉపాధ్యాయులు మందలించడంతో ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల–1లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇదే మండలం దోడిపుట్టు గ్రామానికి చెందిన కొర్రా మోహనరావు(13) అనే విద్యార్థి బుధవారం హాస్టల్‌ గదిలో  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.   పాఠశాల ఉపాధ్యాయులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.  కొర్రా మోహనరావు తరుచూ తరగతులకు గైర్హాజరవుతున్నాడు. ఇదే తరహాలో  రెండు రెండు రోజులుగా పాఠశాలకు రాలేదు. బుధవారం మధ్యాహ్న  భోజనం సమయంలో పాఠశాలకు  రావడంతో ఉపా«ధ్యాయులు మందలించారు.  అనంతరం భోజనం చేసి, తరగతి గదికి వెళ్లకుండా వసతి గృహంలో ఉండిపోయాడు.  తోటి  విద్యార్థులందరూ తరగతి గదులకు వెళ్లిపోయిన తరువాత  మోహనరావు  నైలాన్‌ తాడుతో శ్లాబు   కొక్కేనికి ఉరి వేసికుని  ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడే అటుగా వెళ్లిన కొంతమంది విద్యార్థులు  చూసి ఉపాధ్యాయులకు చెప్పడంతో హెచ్‌ఎం మాణిక్యాలరావు,   ఉపాధ్యాయులు  హాస్టల్‌ గది కి వెళ్లి, విద్యార్థిని కిందకు దింపి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు.

ఉపాధ్యాయుల వల్లే...
ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో మోహన్‌రావు తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.  చదువుకోవడానికి వెళ్లిన కుమారుడు శవంగా మారాడని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని  విద్యార్థి తండ్రి  కొర్రా రామారావు ఆరోపించారు. తన కుమారుడు సక్రమంగానే పాఠశాలకు వెళ్తాడని,  మంగళవారం తోటిస్నేహితులతో  కలిసి స్వగ్రామం దోడిపుట్టుకు వచ్చాడని చెప్పాడు. ఇంట్లో ఉన్న ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌ పుస్తకం తీసుకుని  బుధవారం ఉదయం పాఠశాలకు  వెళ్లాడని తెలిపాడు.  పాఠశాలకు వెళ్లిన కొద్ది గంటలకే మృతి చెందాడని వాపోయాడు. దీనంతటికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తన కుమారుడి మృతిపై  ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాడు.   నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపా«ధ్యాయులు, హెచ్‌ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి బంధువులు డిమాండ్‌ చేశారు.  తండ్రి  ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌ పీహెచ్‌సీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అందరినీ విచారించి కేసు నమోదు చేశారు.  

గాజువాక గణేష్‌నగర్‌లో...
గాజువాక : గాజువాక మార్కెట్‌ సమీపంలో టీ దుకాణం నిర్వహిస్తున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనపై గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అక్కయ్యపాలేనికి చెందిన నక్కా సన్యాసిరావు (25) గాజువాకలోని గణేష్‌నగర్‌లో ఒంటరిగా నివాసముంటున్నాడు. ఇక్కడి మార్కెట్‌ సమీపంలోని రాజీవ్‌మార్గ్‌లో ఆరేడేళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులందరూ నగరంలోనే ఉంటున్నారు. మేనమామ కుమార్తెను వివాహం చేసుకోవాలని మంగళవారం రాత్రి అతడి తల్లిదండ్రులు సన్యాసిరావును ఫోన్‌లో అడిగారు. తనకు ఇష్టం లేదని, వివాహం విషయం తరువాత మాట్లాడుదామని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. ఆ తరువాత ఫోన్‌ స్విచాఫ్‌ అయ్యింది. ఇంతలో సన్యాసిరావు తన గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బుధవారం ఉదయం సమాచారం అందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన సోదరుడుకి ఆత్మహత్య చేసుకోవాల్సిన ఇబ్బందులు లేవని మృతుని అన్న రామస్వామి గాజువాక పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తమకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సీఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మనస్తాపంతో యువకుడు...
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ):  పాతనగరం పరిధిలో ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాతనగరం 25వ వార్డు పరిధి చిలకపేట గ్యాసు గోదాము వద్ద తల్లిదండ్రులతో కలిసి సూరాడ నూకరాజు (21) నివసిస్తున్నాడు. ఈ నెల 12న అర్ధరాత్రి దాటిన తరువాత ఇంట్లో ఉరివేసుకుని మరణించాడు. మరుసటి రోజు ఉదయం విషయాన్ని గమనించిన తల్లి సూరాడ లక్ష్మి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో నూకరాజు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చన్న అనుమానాన్ని తల్లి వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement