
సాక్షి, విశాఖపట్నం: పాక్ గూఢచారి విభాగం పన్నిన హనీట్రాప్ వలలో చిక్కుకుని భారత నౌకాదళ సమాచారాన్ని అందించిన కేసులో తాజాగా మరో ముగ్గురు నేవీ ఉద్యోగుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బృందం అదుపులోకి తీసుకుంది. భారత నావికులకు ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్ వీడియోలు తీసిన పాక్ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై ఉప్పందడంతో నిఘా వర్గాలు నెల రోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గత నెల 20న ఏడుగురు ఇండియన్ నేవీ సెయిలర్స్(నావికులు)తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే.
ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్‌ఐఏ బృందం రెండు రోజులక్రితం విశాఖకు వచ్చింది. ఈ కేసుపై తూర్పు నౌకాదళ ఉన్నతాధికారులతో చర్చించి.. పూర్తి వివరాలు రాబడుతోంది. ఈ క్రమంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్(ఈఎన్‌సీ)లో 2015లో విధుల్లోకి చేరిన రాజేష్, నిరంజన్, లోక్‌నందాలను అరెస్ట్ చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. వీరితో కలపి ఇప్పటివరకు ఈ కేసులో పది మంది నేవీ సెయిలర్స్‌ను అరెస్ట్ చేసినట్లయింది. ఈ వ్యవహారంలో ఇంకా మరికొందరు నేవీ సెయిలర్స్ కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఎన్‌ఐఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment