ఘటనలో దహనమైన మృతదేహాలు
ఆ దీనుల ఆర్తి ఏ దూరతీరాలకూ చేరలేదు. వారి ఆవేదన ఏ భగవంతుని దరికీ చేరలేదు. వారి పేదరికం ఏ అధికారీ, ప్రజాప్రతినిధి మనస్సులనూ కరిగించలేదు. ఆ కుటుంబం నిర్భాగ్యమే మగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు మాడి మసైపోయేలా చేసింది. తండ్రి పోయాక తమకు ఇంక దిక్కెవరని మధనపడుతున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు గ్యాస్ లీకై జరిగిన ప్రమాదంలో బుధవారం సజీవ దహనమయ్యారు. అయితే అది ప్రమాదం కాదని వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.
మల్కన్‌గిరి : జిల్లా కేంద్రంలోని జగన్నాథ మందిరం వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు అక్కాచెల్లెళ్లు బుధవారం ఉదయం సజీవదహనమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన కె.గణపతి రావు, లక్ష్మి దంపతులు. వారికి ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు సంతానం. అమ్మాయిల్లో మంగ(40), మేనక(36), రేణుక(25)లు ఇంట్లో కష్టపడి చేగోడీలు, చుప్పులు తదితర వస్తువులు తయారు చేసి ఇస్తే తండ్రి, అన్నదమ్ములు మార్కెట్‌లో విక్రయిస్తూ కుటుంబాన్ని గుట్టుగా వెళ్లదీస్తున్నారు. ఈ కుటుంబంలో 8 సంవత్సరాల క్రితం తల్లి లక్ష్మి మృతిచెందగా తాజాగా తండ్రి గణపతిరావు ఈ నెల 7వ తేదీన మృతిచెందాడు.
తండ్రి దశదిన కర్మలు పూర్తి చేసిన తరువాత అస్థికలు కలిపేందుకు అన్నదమ్ములు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి బుధవారం వెళ్లారు. ఆ సమయంలో అక్కాచెల్లెళ్లు ఇంట్లో ఉన్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దం విన్న చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారంఅందజేయగా సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కాచెల్లెళ్లు ముగ్గురూ మాడి మసైపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాలను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేదరికమే శాపమైంది: ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా
మల్కన్‌గిరిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన ప్రమాదం కాదని, వారివి ఆత్మహత్యలని ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా అన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. తండ్రి మరణించి 12 రోజులు పూర్తి కావడంతో అస్థికలు కలిపేందుకు ఇద్దరు అన్నదమ్ములు రాజమండ్రి వెళ్లారు. ఇప్పటికే కష్టంగా ఉన్న తమ బతుకులు తండ్రి లేకపోవడంతో మరింత దుర్భరమవుతాయని భావించిన అక్కాచెల్లెళ్లు చిన్న తమ్ముడ్ని మార్కెట్‌కు పంపి, ఇంటి తలుపులు వేసి వంటిపై కిరోసిన్ పోసుకుని గ్యాస్ లీక్ చేసి వెలిగించి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. వారి ఆర్తనాదాలు కూడా చుట్టుపక్కల వారికి వినిపించలేదని ఎస్పీ వివరించారు. పేదరికమే వారి పాలిట శాపమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment