జ్యోతి, అంజలి మృతదేహాలు వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
సంగారెడ్డి రూరల్ : కట్టెల కోసం వెళ్లిన యువతులు కానరాని లోకాలకు చేరుకున్నారు. దప్పిక తీర్చుకునేందుకు పక్కనే ఉన్న చెరువు వద్దకు వెళ్లి ఒకరి తర్వాత ఒకరు ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. ఈ సంఘటన మండలంలోని కలబ్‌గూర్ పెద్ద చెరువులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకొంది. రూరల్ సీఐ నరేందర్ కథనం ప్రకారం.. నేపాల్‌కు చెందిన కొన్ని కుటుంబాలు 20 ఏళ్ల క్రితం సంగారెడ్డిలోని బసవేశ్వర నగర్ (కట్టెకొమ్ము)లో ఉంటూ గూర్కాలుగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం కట్టెలు తెచ్చేందుకు జ్యోతి(17), లక్ష్మి(18), అంజలి(19)ఇంటి నుంచి వెళ్లారు. కల్పగూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లి కట్టెలు సేకరించారు. వేసవి కావడంతో దాహం తీర్చుకునేందుకు చెరువు చెంతకు వెళ్లి నీటిలోకి దిగారు. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పెద్ద గుంతలోకి జారి పోవడంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురూ నీటిలో ముగినిపోయారు.
చాలా సేపటి వరకు వీరు బయటికి రాకపోవడంతో అక్కడే ఉన్న ఓ చిన్నారి ఇంటికి వెళ్లి విషయాన్ని పెద్దలకు చేరవేసింది. దీంతో కుటుంబీకులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని నీటిలో మునిగిన యువతుల ఆచూకి కోసం ఫైర్ స్టేషన్ సిబ్బంది, ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. జ్యోతి, అంజలి మృతదేహాలు లభ్యం కాగా లక్ష్మి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వీరిలో అంజలికి వివాహం కాగా జ్యోతి, లక్ష్మి అవివాహితులు. మృతదేహాలను చూసి కుటుంబీకులు బోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్ సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment