
సాక్షి, ఇబ్రహీంపట్నం : ఫేస్‌బుక్ పరిచయంతో ఓ విద్యార్థినిని హోటల్‌రూమ్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మణికంట, ధీరజ్, భాష అనే నిందితులను పోలీసులు అరెస్టు చేసిస విచారణ జరుపుతున్నారు.
సోషల్ మీడియాలో దృశ్యాలు
మైలవరంలోని ఓ కళాశాలలో చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న స్థానికంగా ఉన్న కేవీఆర్ గ్రాండ్ హోటల్ రూమ్‌ను బుక్‌చేసుకుని కారులో ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడు. కొంత సమయానికి అతని స్నేహితులు మరో ఇద్దరు ఆ రూమ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని బయటపడింది.
అనంతరం సెల్‌ల్లో చిత్రీకరించిన వ్యక్తులు మొదటి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలని యత్నించారు. వీడియోను ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పెడతామని బెదిరించారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, మణికంఠ అనే స్నేహితుడితో లాడ్జికి తాను వెళ్లానని, అక్కడ అతని స్నేహితులు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని బాధితురాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై అత్యాచారయత్నం అభియోగాల కింద కేసు నమోదు చేశారు.