లక్నో : టిక్‌టాక్ మైకంలో పడి ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. తుపాకీతో టిక్‌టాక్ చేద్దామనుకున్న బరేలీకి చెందిన కేశవ్ కుమార్ (18) ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన హఫీజ్‌గంజ్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడి తల్లి ప్రకారం.. ‘ఇంటర్మీడియట్ చదువుతున్న కేశవ్‌కుమార్ కాలేజీ నుంచి రాగానే.. టిక్‌టాక్ చేసుకుంటా... లైసెన్స్డ్ గన్ ఇవ్వమన్నాడు. నేనప్పుడు వంట చేస్తున్నాను. తుపాకీ ఇవ్వనని వారించాను. కానీ, కేశవ్ వినలేదు. నేను వంట పనిలో బిజీగా ఉండటంతో కేశవ్‌కు తుపాకీ ఇచ్చి మళ్లీ పనిలోపడ్డాను. కానీ, కొద్ది క్షణాల్లోనే తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. దాంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. వెంటనే నా కొడుకు పడక గదిలోకి వచ్చి చూశా. కేశవ్ రక్తపు మడుగులో పడున్నాడు.
హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ, లాభం లేకపోయింది. అప్పటికే నా బిడ్డ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు’ అని సావిత్రి దేవి కన్నీరుమున్నీరయ్యారు. కేశవ్ బెడ్‌రూమ్‌లో తుపాకీని భుజంపై పెట్టుకుని పోజిస్తున్న జవాన్ ఫొటో ఉందని ఆమె తెలిపారు. ఆ ఫొటోలో మాదిరిగా టిక్‌టాక్ చేద్దామనుకునే కేశవ్ చనిపోయి ఉండొచ్చని చెప్తున్నారు. తుపాకీ లోడ్ చేసి ఉన్నది గమనించలేదని సావిత్రి పోలీసులకు తెలిపారు. కేశవ్ గతంలో కూడా తుపాకీతో పలు టిక్‌టాక్ వీడియోలు తీశాడని ఆమె వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తుపాకీ సావిత్రి పేరున రిజిస్టరై ఉందని వెల్లడించారు. ఇదిలాఉండగా.. కేశవ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి అతని కుటంబ సభ్యులు అంగీకరించకపోవడం గమనార్హం. కేశవ్ తండ్రి వీరేంద్ర కుమార్ ఆర్మీ అధికారిగా ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment