
ముంబై: అభిమాన్యు గుప్తా.. స్థానికంగా టిక్‌టాక్‌లో పెద్ద స్టార్. అతనికి టిక్‌టాక్‌లో 9.18 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. రోజుకో షార్ట్ వీడియో పెట్టనిదే అతను నిద్రపోడు. కానీ, అతన్ని ముంబై పోలీసులు ఇటీవల ఆకస్మికంగా అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే కాదు.. తీరిక వేళల్లో టిక్‌టాక్ వీడియోలు చేసి.. అలరించే అభిమాన్యు అసలు గుట్టు ఏంటో రట్టు చేశారు. అసలు రాత్రివేళలో చోరకళను అనుసరిస్తూ.. ఇళ్లకు కన్నంవేస్తూ.. భారీగా లూటీ చేస్తాడని, ఉదయం మాత్రం బుద్ధిమంతుడిగా షార్ట్ వీడియోలు చేసి.. జనాలను అలరిస్తాడని పోలీసులు వెల్లడించారు. అతడిపై ఇప్పటికే నాలుగు ఐదు దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు.
జనవరి 19న తమ ఇంట్లో చోరీ జరిగిందని, 150 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్ మొత్తం రూ. 4.75 లక్షల విలువైన సొత్తు అపహరణ గురైందని ఓ వృద్ధ దంపతుల జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ దంపతులు ఉండే భవనంలో అమర్చిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. మొదట చూసిన సీసీటీవీ దృశ్యాల్లో అంత స్పష్టంగా దొంగ ఎవరన్నది కనిపించలేదు. దీంతో మరింత లోతుగా ఆ దృశ్యాలను పరిశీలించి.. మానవ అవగాహనతో విశ్లేషించగా.. అసలు దొంగ అభిమాన్యు గుప్తానని తేలింది. దీంతో గత నెల 28న కుర్లాలో అతన్ని అరెస్టు చేసి.. పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
మొదట విచారణలో అతడు దొంగలించిన సొత్తు ఏమైందన్నది తెలియలేదు. కానీ, రోజుల తరబడి విచారించగా.. దొంగలించిన సొమ్మును తన స్నేహితులకు ఇచ్చానని, దొంగతనం చేసిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. దీంతో, అతని స్నేహితుడి వద్ద నుంచి బంగారం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇవి తన భార్య నగలు, అభరణాలని, కొన్నిరోజుల వరకు భద్రపరచాలని తనకు ఇచ్చాడని అభిమాన్యు స్నేహితుడు పోలీసులకు చెప్పుకొచ్చాడు. అభిమాన్యు గుప్తా వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నాడని, అతని మీద నాలుగు నుంచి ఐదు కేసులు ఉన్నాయని పోలీసు అధికారి హరి బిరాదర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment