
సాక్షి, విజయవాడ: పచ్చని కాపురంలో ‘టిక్ టాక్’ చిచ్చుపెట్టింది. టిక్ టాక్ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్ మిడియాలో బాగా క్రేజ్ ఉన్న ‘టిక్ టాక్’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్ టాక్ ఇప్పుడు భార్యాభర్తల మధ‍్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి జాఢ్యంలా మారి జీవితాల్లో చిచ్చు పెడుతుంది. తాజాగా ఈ టిక్ టాక్ మాయలో పడి కట్టుకున్న భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని...మొదటి భార్యను కడతేర్చేందుకు సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే...విజయవాడ వీటీపీఎస్‌లో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సత్యరాజుతో అనురాధకు పదేళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజులపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవటంతో అనురాధకి కష్టాలు మొదలయ్యాయి. భర్త సూటిపోటీ మాటలతో పాటు, అత్తింటి ఆరళ్ళు పెరిగిపోయాయి. అయినా వాటన్నింటినీ పంటిబిగువున అదిమి పెట్టుకొన్నఅతికష్టం మీద కాలం వెళ్లదీస్తుంది. అయితే టిక్ టాక్‌లో వచ్చిన వీడియోతో భర్త నిజస్వరూపం బయటపడింది.
పరస్త్రీతో సన్నిహితంగా ఉన్న ఆ వీడియోను చూసిన అనురాధ తట్టుకోలేకపోయింది. ఆరాతీస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన వనిత అనే యువతిని తిరుపతిలో వివాహం చేసుకొని వేరుకాపురం పెట్టినట్టు తెలుసుకొంది. ఈ విషయాన్ని నిలదీయడంతో పెద్దల సమక్షంలో తప్పు ఒప్పుకుని, మరోసారి అలా జరగదంటూ ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత తన నిజ స్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఇంకా పిల్లలు లేరంటూ మొదటి భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ఎక్కువ కావడంతో మొదటి భార్య తన తల్లిదండ్రులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment