స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లు
తిరుపతి క్రైం : మోటారు సైకిళ్ల దొంగను అరెస్టు చేసి 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. సోమవారం తన కార్యాలయంలోనాయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేణిగుంట–చంద్రగిరి మార్గంలో రామానుజపల్లె వద్ద ఎస్‌ఐ ఈశ్వరయ్య వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బాలుడు వీరిని చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, అనుమానం కొద్దీ అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తిరుపతిరూరల్ మండలం సాయినగర్ పంచాయతీ లింగేశ్వర్‌నగర్‌కు చెందిన 18 ఏళ్ల బాలుడని తేలిందన్నారు. అతను నడుపుతున్న మోటార్ సైకిల్ దొంగలించినదిగా గుర్తించి కేసు నమోదు చేశారు.
మాట్లాడుతున్న అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్
అంతకుముందు ముందు తిరుచానూరు పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలై తిరుగుతున్నాడని, ప్రాథమిక విచారణలో ఆ బాలుడు తన స్నేహితులైన ఐక్య ఉపాధ్యానగర్‌కు చెందిన సంతోష్, సాయినగర్‌కు చెందిన వినయ్‌తో కలసి 2018 నుంచి ఇప్పటి వరకు 12 మోటారు సైకిళ్లను శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో దొంగలించినట్టు తేలిందని చెప్పారు. అయితే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్ల విలువ రూ.5.60 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసును ఛేదించడంలో ఎమ్మార్‌పల్లె సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఐ ఈశ్వరయ్య, సిబ్బంది దీపిక, మోహన్, తిలక్‌కుమార్, అమరనాథరెడ్డి, కరీముల్లా, జగదీష్ కృషి చేశారని చెప్పారు. వారికి నగదు రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment