సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో తెరాస నాయకుడిని కాంగ్రెస్ వర్గీయులు దారుణంగా హత్య చేశారు. యర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న సహకార ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఓటర్లను కలుస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాదాపు 20 మంది కాంగ్రెస్ వర్గీయులు మారణాయుదాలతో వెంబడించగా గ్రామానికి చెందిన అవుదొడ్డి వీరయ్య ఇంటిలో దాక్కున్న వెంకన్నను కత్తులతో నరికి, బండ రాయితో కొట్టి హత్య చేశారు. సమస్యాత్మక గ్రామమైన యార్కరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నుండే ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
సహకార ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓటర్లను సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉంచగా కాంగ్రెస్ వర్గీయులు అక్కడికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కాంగ్రెస్ వర్గీయులపై తెరాస నాయకులు దాడికి పాల్పడ్డారు. జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న కాంగ్రెస్ వర్గీయులు అదును కోసం వేచి చూసి ఎన్నికల ప్రచారంలో ఉన్న వెంకన్నను అర్ధరాత్రి సమయంలో వెంబడించి హత్య చేశారు. ఐతే ఈ క్రమంలో కాంగ్రెస్ వర్గీయుడు మిద్దె సైదులుకు సైతం కత్తి గాయం అయింది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్ రావు నేతృత్వంలో యర్కారంలో పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. మరోవైపు సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment