ధారూరు: భూతగాదాలు ఓ వ్యక్తిని బలి తీసుకున్నాయి. దుండగుల దాడిలో ఓ టీఆర్‌ఎస్ నేత హత్యకు గురయ్యారు. అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ధారూరు మండలం మైలారానికి చెందిన పెండ్యాల శ్రీనివాస్(38) టీఆర్‌ఎస్ మండల కార్యనిర్వాహక కార్యదర్శి. ఈయన భార్య యాదమ్మ ధారూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్. మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తతండాలో ఆదివారం జరిగిన ఓ వివాహానికి శ్రీనివాస్ హాజరయ్యాడు.
అనంతరం హరిదాస్‌పల్లికి చెందిన జి.వినోద్‌తో కలసి సమీపంలోని తన పొలానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మైలారానికి చెందిన మద్దులపల్లి దాసు(37), రత్నం(36), ప్రశాంత్ (27), అరుణ్(24)లు ఎదురుగా వచ్చి తమ బైక్‌లను దారికి అడ్డంగా పెట్టారు. శ్రీనివాస్, వినోద్ అప్రమత్తమై మైలారం గ్రామం వైపు పారిపోయారు. ప్రత్యర్థులు తరుముకుంటూ వస్తుండగా రోడ్డు మధ్యలో ఉన్న రాయికి తగిలి శ్రీనివాస్ ద్విచక్రవాహనం పడిపోయింది. వెంటనే వినోద్ ప్రాణభయంతో పారిపోయాడు.
శ్రీనివాస్ తన అనుచరులకు సెల్‌ఫోన్‌లో సమాచారం అందించేందుకు ప్రయత్నించాడు. వెంటనే దుండగులు వేట కొడవలితో అతడి ఎడమ చేతిని నరికారు. మెడ, తలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడు మృతి చెందా డని నిర్ధారించుకున్న దుండగులు ధారూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. శ్రీనివాస్, దాస్ మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు, కక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్యకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. హత్యతో మైలారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment