
శశికుమార్ (ఫైల్)
చెన్నై,వేలూరు: జోలార్‌పేట బస్టాండ్ సమీపంలో చెన్నైకి చెందిన టీవీ సీరియల్ కెమెరామెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నై వలసరవాక్కం గంగమ్మ వీధికి చెందిన శశికుమార్(47) టీవీ సీరియల్ కెమెరామెన్. ఇతని భార్య రాఘవి. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా శశికుమార్ పనిచేస్తున్న స్టూడియోలో ఉన్న కెమెరాను రూ.2 లక్షలకు కుదవపెట్టినట్లు తెలిసింది. దీంతో స్టూడియో యాజమాన్యం విరుగంబాక్కం పోలీసులకు శశికుమార్‌పై ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన శశికుమార్ ఈనెల 9న ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదు.
ఈ క్రమంలో వేలూరు జిల్లా జోలార్‌పేట బస్టాండ్ సమీపంలోని చెరువు గట్టు వద్దనున్న ఒక చెట్టుకు శశికుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం స్థానికులు గుర్తించారు. వెంటనే జోలార్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అనంతరం అతని పర్సులో ఉన్న ఫొటోలను పరిశీలించగా అందులో భార్య, కుమార్తె ఫొటో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతని సెల్‌ఫోన్ నంబర్ ద్వారా అతని వివరాలను తెలుసుకొని వలసరవాక్కం పోలీసుల ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. భార్య రాఘవి తన భర్త మృతిపై అనుమానం ఉందని జోలార్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment